Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 2:52 pm Posted by : ramakrishna

నిజామాబాద్ ఆర్వోబిల నిర్మాణానికి రూ.14.77 కోట్ల నిధులు విడుదల

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న రైల్వే క్రాసింగ్ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ వోబి)ల నిర్మాణంతో పాటు వాటికి అనుసంధానంగా నాలుగు వరుసల రహదారుల నిర్మాణానికి రూ.14.77 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేసిన నిరంతర కృషి ప్రభుత్వంతో జరిపిన సమన్వయ ప్రయత్నాల ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అర్సపల్లి రైల్వే ఆర్ వోబి నిర్మాణానికి రూ.8,48,65,952, మన్మాడ్ సికింద్రాబాద్ రైల్వే లైన్ నిజామాబాద్ బైపాస్ రోడ్డు వద్ద ఆర్ వోబి నిర్మాణానికి రూ.4,04,53,437, హైదరాబాద్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై డిచ్‌పల్లి శివారు మాధవ్‌నగర్ వద్ద ఆర్ వోబి నిర్మాణానికి రూ.2,24,67,543 నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో ఆర్ వోబిల నిర్మాణంతో పాటు వాటికి అనుసంధానంగా నాలుగు వరుసల రహదారుల అభివృద్ధికి మార్గం సుగమం కానుందన్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే రైల్వే గేట్ల వద్ద వాహనాల నిరీక్షణ తగ్గడంతో పాటు జిల్లా ప్రజలు, ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అత్యవసర సేవలు, నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు కూడా గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. జిల్లా అభివృద్ధికి దోహదపడే ఈ నిర్ణయంపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కృషి చేసిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అవసరాలను గుర్తించి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. జిల్లాలో కీలకమైన నిర్మాణానికి నిధులు విడుదల కావడం ప్రజల చిరకాల అవసరాన్ని నెరవేర్చే దిశగా ముందడుగు అని పేర్కొన్నారు. భివృద్ధి పనులకు సహకరించాల్సిన ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ప్రజా అవసరాల కోసం నిధులు విడుదల చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో ఇక్కడి బీజేపీ ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను నిర్వర్తించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు రావాల్సిన కేంద్ర నిధులను సాధించడంలో చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించాలని సవాల్ విసిరారు. రాజకీయ విమర్శల కంటే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Funds worth ₹14.77 crore released for the construction of ROBs in Nizamabad.