నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ఎల్ గౌడ్ బుధవారం నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి, పుష్పాగుచ్చం అందజేశారు. గౌడ్ కు జిల్లాజడ్జి తమ ఆశీస్సులు అందజేశారు.ప్రాసిక్యూటర్ గా విధులలో ఉన్న స్వంత న్యాయవాద ప్రాక్టీస్ ను కొనసాగిస్తూ భవిష్యత్ వైవు అడుగులు వేయాలని ఆమె సూచించారు.ఆర్. ఎస్. ఎల్ గౌడ్ వెంట బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి,సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్,జక్కుల వెంకటేష్వర్, ఆశా నారాయణ, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మి నర్సయ్య ను కలిశారు. నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ ను కలిసి శాలువ, పుష్పాగుచ్చం అందజేశారు.
- గౌడ్ నేపథ్యం…
నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన గౌడ్ ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించిన అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ జవహర్ లాల్ నెహ్రు లా కళాశాల నుండి లా పట్టభద్రులైనారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాది గా పేరు నమోదు చేసుకుని దివంగత సీనియర్ న్యాయవాది పిపి గంగారెడ్డి దగ్గర జూనియర్ న్యాయవాది గా చేరి సివిల్, క్రిమినల్ కేసులలో ప్రావీణ్యత సంపాదించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తరపున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా పదకొండు ఏళ్ళు న్యాయసేవలు అందించారు. మద్యవర్తిత్వ కేంద్రం సభ్యులుగా ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా కాంగ్రెస్ కార్యకర్తలకు బాసటగా నిలబడ్డారు.
- పలువురి అభినందనలు..
తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి గౌడ్ కు అభినందనలు తెలిపారు.బార్ అధ్యక్షుడు సాయరెడ్డి,ఉపాధ్యక్షుడు దిలీప్, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు శుభఆశీస్సులు అందించారు.