. . . గ్రామదేవతలకు జలాభిషేకాలు, నైవేద్యాలు
ఇందల్వాయి, బతుకమ్మ :
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఇందల్వాయి మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దర్శనం మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని దేవతలకు జలాభిషేకాలు చేసి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వరుణదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలని ప్రార్థిస్తూ కప్పలను తడి వస్త్రంలో తీసుకొచ్చి కర్రకు కట్టి, డప్పు చప్పుళ్ల మధ్య “కప్పతల్లి.. కప్పతల్లి..” అంటూ పాటలు పాడుతూ గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కప్పలపై బిందెలతో నీటిని పోస్తూ సంప్రదాయ ఆచారాన్ని పాటించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇకనైనా మంచి వర్షాలు కురిసి పంటలు పండాలని గ్రామస్తులు వేడుకున్నారు. కప్పతల్లి ఆటలు నిర్వహిస్తే వరుణదేవుడు ప్రసన్నమై వర్షాలు కురిపిస్తాడనే విశ్వాసం తమ పెద్దల కాలం నుంచి కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.