Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 8:01 pm Posted by : ramakrishna

షెడ్యూల్డ్ కులాల యువతకు ఉచిత ఈడిపి శిక్షణ

 

. . . జిల్లా కార్య నిర్వాహక సంచాలకులు జె.శ్రీదేవి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకుల కోసం వ్యవస్థాపకతతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం (ఈడీపీ) నిర్వహించనున్నట్లు జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు జే.శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులకు జిల్లాలోని నిపుణ్ ఎడ్యుకేషన్ సొసైటీ, యెండల టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్ వద్ద ఎనిమిది రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణలో వ్యాపార నిర్వహణ, వ్యవస్థాపకత, ఆర్థిక ప్రణాళిక, స్వయం ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు  http://tsscbhavitha.cgg.gov.in/homePage లోని క్యాండిడేట్ కార్నర్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యార్హతల ధృవీకరణ పత్రాలను జత చేసి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం, ఐడిఓసి, కలెక్టరేట్, రూమ్ నెం.102 లో సమర్పించాలని కోరారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణ పొందడం ద్వారా స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు జే.శ్రీదేవి విజ్ఞప్తి చేశారు.