నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగర శివారులోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో పూర్తిగా నిర్మాణం కాని భవనాన్ని చూపుతూ శ్రీ చైతన్య పేరుతో విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నారని టీజీవీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజవాణిలో అదనపు కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలకే సరైన అనుమతులు లేకపోగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో భవనాన్ని చూపి విద్యాశాఖ అధికారులనుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్స్ చేసి విద్యార్థుల తల్లి తలిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు.
బాధ్యులను వెంటనే పట్టుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా పోలీస్ అధికారులను ఆదేశించాలని కోరారు. తక్షణమే డీఈవో స్పందించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో నగర నాయకుడు వినయ్, మహేశ్ తదితరులు ఉన్నారు.
