. . . అమాయకుల తో సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠా పై కఠిన చర్యలు చేపట్టండి
. . . పార్లమెంట్ లో లేవనెత్తిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి
వెబ్ డెస్క్, బతుకమ్మ :
తెలుగు రాష్ట్రాల నుండి యువతను థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అక్కడికి చేరిన వెంటనే వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, మయన్మార్‌లోని మయావడ్డి వంటి తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సైబర్ నేర శిబిరాలకు విక్రయిస్తున్నారు. బాధితులకు తీవ్రమైన హింస, ఆహారం ఇవ్వకపోవడం, చీకటి గదుల్లో నిర్బంధం వంటి దారుణాలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి, థాయ్ లాండ్ లో చిక్కుకున్న భారతీయులను రక్షించి, తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. పార్లమెంట్ శితా కాల సమావేశాలలో నిబంధన 377 కింద అత్యవసరంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి థాయ్ లాండ్ లో ఉద్యోగాల పేరిట మోసపోయిన యువత పక్షాన లేవనెత్తారు. యువతను నకిలీ ఉద్యోగాల పేరుతో విదేశాలకు తరలించి, సైబర్ నేర గ్యాంగ్‌లకు బందీలుగా మార్చుతున్న అత్యంత తీవ్రమైన సమస్యపై లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేరాలకు స్థానిక మిలీషియా, సైన్యంలో కొందరు లంచాలు తీసుకుని సహకరిస్తున్నందున రక్షణ చర్యలు మరింత కష్టతరం అవుతున్నాయని ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు కూడా ఈ ముఠాకు బలి అయ్యే ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయి ఉన్నారని చెప్పారు. వారి కుటుంబ సభ్యుల ద్వార ఈ విషయం తెలిసిందని పేర్కోన్నారు. ఈ పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి, చిక్కుకున్న భారతీయులను రక్షించి, తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా వెనుకబడ్డ జిల్లాలో విదేశీ ఉద్యోగ మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఈ నేరాలకు సహకరిస్తున్న భారతీయ ఏజెంట్లు, రిక్రూటర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ అర్వింద్ కోరారు.