. విడతల వారీగా రూ.9లక్షలు వసూలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి మలావత్ మోహన్ అనే వ్యక్తి రూ.9లక్షలు వసూలు చేశాడని తేజావత్ పీరు అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి..
నిజామాబాద్ రూరల్ మండలం లింగితండాకు చెందిన తేజావత్ పీరును తన బంధువైన సిరికొండ మండలం చీమన్ పల్లికి చెందిన మలావత్ మోహన్ తాను చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించానని, నీకు కూడా ప్రభుత్వ ఉద్యోగం (పోస్ట్ ఆఫీస్ లో) ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. మోహన్ మాటలను నమ్మిన పీరు విడతల వారీగా రూ.4లక్షలు అతడికి చెల్లించింది. వీటిలో రూ.3లక్షలు తన భర్త ఫోన్ పే నుంచి చెల్లించగా, మిగతా లక్ష రూపాయలు నగదు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న మోహన్ రేపుమాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు.
తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని లేదా తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని పీరు ఒత్తిడి చేయడంతో పోస్టాఫీస్ లో ఉద్యోగం వచ్చిందని ఒక నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. అది ఫేక్ అని తేలడంతో పీరు మోహన్ ను నిలదీయగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, కోర్టులో జాబ్ ఇప్పిస్తానని మళ్లీ నమ్మించి రూ.5లక్షలు వసూలు చేశాడు. కోర్టులో జాబ్ వచ్చిందని చెప్పి, జిల్లా జడ్జి సంతకం ఫోర్జరీ తో అపాయింట్ మెంట్ ఆర్డర్ కాపీని ఇచ్చాడని పీరు ఆవేదన వ్యక్తం చేసింది.
మలావత్ మోహన్ ఉద్యోగం పేరుతో తనను నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని, వెంటనే అతడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితురాలు పీరు కోరుతోంది.