. . . ముంపు సమస్యకు చెక్ పెట్టిన ఎమ్మెల్యే మదన్ కు కర్షకుల ధన్యవాదాలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ:
నాగిరెడ్డిపేట మండల రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సమస్యకు చివరకు పరిష్కారం దొరకనుంది. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులను గత 40 సంవత్సరాలుగా వేధిస్తున్న ముంపు సమస్యకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరంతర కృషితో ఎండ్ కార్డ్ పడింది. ప్రభుత్వం రూ.2.08 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి.ప్రతి సంవత్సరం మంజీరా నది ఉధృతంగా ప్రవహించే సమయంలో నాగిరెడ్డిపేట మండలంలోని గోల్లింగాల్, వాడి, చినూర్, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, మసానిపల్లి, ఆత్మకూరు తదితర గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిలో మట్టిదిబ్బలు, తుమ్మచెట్లు, ముళ్లపొదలు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి వేల ఎకరాల పంట భూములు ముంపునకు గురవుతూ రైతులకు భారీ నష్టాలు కలుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం రైతులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు.కానీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, గత ప్రజాప్రతినిధుల అలసత్వం, చేతగానితనం కారణంగా ఈ సమస్య ఎప్పటికప్పుడు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఒక దశలో రైతులు ఈ సమస్యకు పరిష్కారం దొరకదనే నిరాశకు కూడా గురయ్యారు. అయితే చివరి ఆశగా నాగిరెడ్డిపేట మండల రైతులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ని కలిసి తమ గోడును వినిపించారు. రైతుల కష్టాలను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యత గా తీసుకుని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరంతర ప్రభుత్వంపై ఒత్తిడి, ప్రత్యేక చొరవ ఫలితంగా ప్రభుత్వం రూ.2.08 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో మంజీరా నదిలో పేరుకుపోయిన పూడికలు, మట్టిదిబ్బలు, తుమ్మ చెట్టు, ముళ్లపొదలను తొలగించి నీటి ప్రవాహాన్ని సక్రమంగా జరిగేలా చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఈ పనులు పూర్తయితే వర్షాకాలంలో నది ఉధృతంగా ప్రవహించి నప్పటికీ పంట భూములు ముంపునకు గురయ్యే పరిస్థితి గణనీయంగా తగ్గిపోతుంది. వేలాది మంది రైతులకు శాశ్వత ఉపశమనం లభించడంతో పాటు వ్యవసాయానికి భద్రత కలగనుంది. పనులు ప్రారంభం కావడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలను తన కష్టాలుగా భావించి పరిష్కారం కోసం పోరాడిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారే తమకు నిజమైన అండగా నిలిచారని రైతులు పేర్కొంటున్నారు.”ఎన్నో సంవత్సరాల తర్వాత రైతుల బాధలు అర్థం చేసుకొని, రైతు సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు మాకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రూపంలో దొరికారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం రైతాంగ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది” అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.