ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన టీఎన్జీవో కామారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.సి. పోచయ్య గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పోచయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామ సర్పంచ్ లోకని గంగమని గంగారం ఆధ్వర్యంలో, మత్స్య శాఖ జిల్లా నాయకుల సహకారంతో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మోత్కూరు నవీన్ గౌడ్ తెలిపారు. పార్టీ కార్యకర్తల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. అయితే ఇదే సమయంలో ఇందల్వాయి గ్రామ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నాయకులు తాజా పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం తమను అవమానించడమేనని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందల్వాయి సింగిల్ విండో చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డికి కూడా సమాచారం ఇవ్వకుండా కొందరు నాయకులు ఏకపక్షంగా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలపై కార్యకర్తలకు పూర్తి స్పష్టత ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని గ్రామ సర్పంచ్ గంగమని గంగారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ ప్రమోటర్ కస్పా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ చైర్మన్ బి. శ్రీనివాస్, బడ్సి ఎంపీటీసీ రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నవీన్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ కె. ఆనంద్, సర్పంచ్ గంగమని గంగారం, ఇందల్వాయి గ్రామ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ భాగిద్య నారాయణ, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరి రవి, పూజ్యం రవికుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తోట చిన్న రాజన్న, వై. ప్రసాద్, ఈర్ల సాయందర్ తదితరులు పాల్గొన్నారు.
