. . . అటవీ శాఖ, రెవెన్యూ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలి
. . . కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీ, దొడ్డి కొమురయ్య నగర్ ,300 కోటర్స్ ,అసద్ బాబా నగర్ ఇబ్రహీం నగర్, ధర్మపురి హిల్స్, డీఎస్ కాలనీ ప్రజలకు అటవీ శాఖ అధికారులు తమ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మించారని నోటీసులు అందజేశారని, నోటీసులకు సమాధానం ఇస్తూ బహుజన కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో అటవీ శాఖ నార్త్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నిరుపేదలకి ఇండ్ల పట్టాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాలని కేటాయించి ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం గత పదిహేళ్లుగా పాలన కొనసాగించిన టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా నోటీసులు జారీ చేయించిందన్నారు. ప్రస్తుతం ఆ స్థలాలలో నిరుపేదలు గత 20 ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారని, ఆయా కాలనీలకు విద్యుత్ శాఖ అధికారులు కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కరెంటు మీటర్ని ఇవ్వడం జరిగిందని, ఇంటి నెంబర్లను కేటాయించారని, మున్సిపల్ టాక్స్ లను కూడా వేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్లు , డ్రైనేజీ నిర్మాణ పనులను కూడా చేపట్టారని, ఇది రెవెన్యూ భూమి అయినప్పటికీ అటవీశాఖ అధికారులు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను కూడా నిర్మించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషయంపై గతంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి కూడా విన్నవించడం జరిగిందన్నారు. నగరం విస్తరణ దృష్ట్యా అటవీశాఖ, రెవెన్యూ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపెట్టాలన్నారు. ఈ ప్రాంతంలో పదివేల కుటుంబాలు నివసిస్తున్నారని, వారికి తగిన న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన కాలనీ నాయకులు మారుతి, లక్ష్మీ, మహబూబ్, ఆరిఫ్, గంగా, రక్ష, జరీనా, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
