. . . మినహాయించిన వేతనాన్ని ఉద్యోగుల ఎకౌంటుకు జమ చేయాలి
. . . ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వం ఎంప్లాయిస్ ఆరోగ్య పథకం కోసం ఉద్యోగుల మే నెల వేతనం నుండి 1.5 శాతం మినహాయిస్తూ పేస్లిప్స్ జనరేట్ చేయడం సరి కాదని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించకుండా, కనీసం డ్రాయింగ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం దొడ్డిదారిన ఉద్యోగుల వేతనం నుండి 1.5 శాతం మినహాయింపు చేయడాన్ని ఎస్సీ,ఎస్టీ ఉపాద్యాయ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఏ హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నారనే స్పష్టత లేదని, భార్యాభర్తలు ఉద్యోగులైన సందర్భాలలో, తల్లిదండ్రులు ఉద్యోగులైన సందర్భాల్లో, వేతన మినహాయింపులు ఏ విధంగా చేస్తారనే నిబంధనలు రూపొందించకుండానే ప్రతి ఉద్యోగం నుండి మినహాయింపు చేశారన్నారు. ఇది అక్రమమైన చర్యగా భావిస్తున్నామని, హెల్త్ కార్డులు జారీ చేయకుండా, టీచర్ల సమ్మతి తీసుకోకుండా మినహాయించిన 1.5 శాతం వేతనాన్నీ ఉద్యోగుల ఎకౌంటుకు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రభుత్వ అసంబద్ధ విధానాల పైన ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని, జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లమారి మల్లికార్జున్ లు తెలిపారు.