Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:26 pm Posted by : ramakrishna

ప్రజలను ఎన్నాళ్లు “మద్యం”మత్తు లో ముంచుతారు..!

 

. . . మద్యాన్ని ఆదాయ వనరుగా చూసే తీరు మారేదేప్పుడు..!

 

. . . లెక్కలు చూస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే

 

అల్లే రమేష్, సిరిసిల్లా :

 

అదేంటో పైకి మాత్రం రాజకీయ పార్టీలన్నీ కాసేపు జెండాలు పక్కకు పెట్టి ఆదర్శాలే మాట్లాడుతుంటాయి. ఆచరణకు వచ్చేసరికి పార్టీ ఏదైనా జెండా ఏదైనా కానీ గొంతు పెగలదు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను చూస్తే పరిస్థితులు అవే విషయాలను తెలుపుతున్నాయి. తెచ్చుకున్న  తెలంగాణకు తామే అసలు సిసలు బ్రాడ్ అంబాసిడర్లమని చెప్పుకుంటున్న పార్టీలు గొంతు విప్పవు. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీగా మారిన మద్యాన్ని ఆదాయ వనరు గాని చూస్తుంది తప్ప విధ్వంసం అవుతున్న మానవ జీవితాల సంగతి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు పట్టుకొస్తున్న  మద్యం పాలసీల వెనుక నిజానిజాలు ప్రభుత్వాలు కేవలం ఆదాయ వనరుగా మాత్రమే మద్యాన్ని చూస్తున్న వైనంపై  పరిశీలన..

నడుస్తున్న కాలంలో కాస్త అటు ఇటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే కొంచెం ముందుకు వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ పాలసీ ద్వారా ఆనాటి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 9,572. 61 కోట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రజల చూపును పక్కదారి పట్టించడానికి ప్రభుత్వాలు కేవలం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు  చేస్తున్న ప్రయత్నాలు కూడా గమనించవచ్చు. 1991_ 92 ప్రాంతంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా దుబగుంట ప్రాంతంలో రోషమ్మ ఆధ్వర్యంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆనాడు ఎక్కడ చూసినా గ్రామ గ్రామాన మహిళలు చైతన్యవంతమై తమ కుటుంబాలను గుల్ల చేస్తున్న మద్యాన్ని పారద్రోలెందుకు  ఉద్యమ బాట పట్టారు. అనేక ప్రజా సంఘాలు ఆ ఉద్యమాలకు తోడు గా నిలిచాయి.పార్టీలు సైతం ఆనాటి మధ్య నిషేధ ఉద్యమంలో కలిసి వచ్చిన పరిస్థితి.ఫలితంగా 1995 ప్రాంతంలో సంపూర్ణ మధ్య నిషేధ పాలసీ వచ్చింది. తరువాత దాని అమలు తీరు ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే ఆనాడు ప్రజల్లో ప్రభుత్వలా తీరుపై వ్యతిరేకత వచ్చిందనే విషయం స్పష్టం.

తెలంగాణ రాష్ట్రం వస్తేనే మద్యం మహమ్మారికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని భావన అప్పట్లో ప్రజల్లో కనిపించేది. చిత్రంగా అసలు ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వాలు పట్టించుకున్న పరిస్థితి లేకుండా పోయింది. విచిత్రం ఏమిటంటే తర్వాత వచ్చిన పార్టీల ప్రభుత్వాలు సైతం మద్యాన్ని ఆదాయ వనరుగా మాత్రమే చూస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయన్న విషయం లెక్కలను గమనిస్తే అర్థమవుతుంది.

2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటైన తర్వాత గమనిస్తే 2004- 2005 ఆర్థిక సంవత్సరంలో 2,092.67 కోట్ల ఆదాయంగా మొదలై 2008-09 ఆర్థిక సంవత్సరానికి 5,752.61 కోట్లకు పెరిగింది. అంటే సుమారు 42 .37 శాతం పెరిగినట్లు గమనించవచ్చు. 2010-11 లో  8,265. 2011_12 లో 9,612 కోట్లు 2013-14 6 లో 6,250 కోట్లకు కాస్త తగ్గినట్లు కనిపించిన తర్వాత కాలంలో ఆనాటి ప్రభుత్వాలు కేవలం మద్యాన్ని ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నట్లు కనిపిస్తోంది.

2018 – 19 ఆర్థిక సంవత్సరంలో 10,638 కోట్ల ఆదాయం ప్రభుత్వాలు సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. అలా ప్రభుత్వం ఆదాయం మాత్రం పెరుగుతూ పోతుంది మరోవైపు ప్రజల ఆరోగ్యాలు ఆవిరవుతూ వస్తున్నాయి. 2022_24 ఆర్థిక సంవత్సరం 20,299 కోట్లకు పాత ప్రభుత్వాల తీరుని కొనసాగిస్తూ వస్తున్న క్రమంలో 2024 _25 ఆర్థిక సంవత్సరంలో 18,604 కోట్లకు కాస్త తగ్గినట్లు కనిపించిన 2025_26 ఆర్థిక సంవత్సరంలో 23,623 కోట్లతో గత లెక్కలతో పోల్చుకుంటే 11. 58 శాతం ఎక్కువ పెంచినట్లు కనిపిస్తుంది. ఇది కేవలం కాగ్ పేర్కొన్న నివేదికల ఆధారంగా మాత్రమే. క్షేత్రస్థాయిలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామాలు మద్యం మత్తులో మునిగి తేలుతున్నాయి. మద్యానికి బానిసైనా ఎంతోమంది తమ కుటుంబాలకు తీరని నష్టాన్ని కష్టాన్ని తెచ్చిపెడుతున్న పరిస్థితి.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పరిస్థితులు ప్రజలను మత్తులో ముంచేందుకు ఎంత తీవ్రమైన కృషి చేస్తున్నాయో అర్థం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెల్ట్ షాపులు లేని గ్రామాలు అరుదుగా ఎక్కడో ఒక చోట ఉంటుంది. మద్యం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి ఏరులై పారుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా పోరాడవలసిన అవసరమైతే ఉంది.