Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 10:53 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లాలో రూ.130.37కోట్ల వరద నష్టం

  • తక్షణ మరమ్మత్తుల కోసం 22.47 కోట్ల నిధుల విడుదల

కామారెడ్డి బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల వరద బీభత్సానికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే, రాష్ట్ర మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యటన, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్  సంగవాన్, అధికార యంత్రంగం ద్వారా సేకరించిన వివరాలతో జరిగిన నష్టాన్ని అంచనావేసింది. కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల కుంభవృష్టి కారణంగా పంట నష్టంతోపాటు రోడ్లు కొట్టుకపోవడం, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలలు, విద్యుత్ శాఖ, మున్సిపాలిటీలలో   జరిగిన నష్టానికి అంచనా వేయడంతో పాటు తక్షణంగా మరమ్మత్తుల కోసం నిధులను కేటాయించింది.. కామారెడ్డి జిల్లాలో 12 శాఖల పరిధిలో 633 పనుల కోసం 13037 లక్షల నష్టం వాటిల్లగా  తక్షణంగా మరమ్మతులు చేపట్టడానికి  2247.76 కేటాయిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

  • ప్రభుత్వ శాఖల వారీగా జరిగిన నష్టం.. తక్షణ మరమ్మత్తుల కోసం నిధుల విడుదల..

నీటిపారుదల శాఖకు 98 పనులకు సంబంధించి రూ. 3478.60 లక్షల నష్టం వాటిల్లినట్టు అంచనా వేయగా తక్షణంగా మరమ్మత్తులకు  143.80 లక్షలు విడుదల చేశారు. 79 రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన పనులకు నష్టం వాటిల్లగా 6119.40 లక్షలు నష్టం జరిగింది. ప్రభుత్వం 346.10 లక్షలను విడుదల చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 48 పనులకు సంబంధించి 1150.20 లక్షల నష్టం వాటిల్లితే 154.15 లక్షల నిధులను విడుదల చేసింది. ఆర్ డబ్ల్యు ఎస్ మిషన్ భగీరథ పనులకు సంబంధించి 18చోట్ల పనులకు 225 లక్షల కేటాయించింది. వరదల కారణంగా కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడంతో వాటికోసం 2009 లక్షల కేటాయించింది. కామారెడ్డి బల్దియాలో 106 చోట్ల  జరిగిన 1326 లక్షల వరద నష్టానికి  1106 లక్షల నిధులను అత్యవసరంగా కేటాయించింది. బాన్సువాడలో 4 బల్దియా పనుల కోసం 35.86 లక్షల రూపాయలను కేటాయించింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 5 పనుల నిమిత్తం 20. 30 లక్షల నిధులను ఇచ్చింది. బిచ్కుంద మున్సిపాలిటీలో 7.50 లక్షలతో మరమ్మతులు చేపట్టాలని నిధులను కేటాయించింది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 40 చోట్ల జరిగిన నష్టానికి 47.30 లక్షల నిధులను రిపేర్ల కోసం ఇచ్చారు. జిల్లా పంచాయతీ విభాగం ఆధ్వర్యంలో  38 గ్రామపంచాయతీలలో  105.57 లక్షల నిధులను ఇచ్చింది. 2003 ప్రభుత్వ పాఠశాలలో వరదల వల్ల జరిగిన నష్టానికి మరమ్మత్తుల కోసం  909.75 లక్షలను తక్షణంగా విడుదల చేసింది. 32,97 ఎకరాలలో పంటల నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట నష్టం పరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే బాధితులకు పరిహారాన్ని అందజేయనున్నారు.