Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 6:22 pm Posted by : ramakrishna

బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం తక్షణమే అమలు చేయాలి

. . . ప్రగతిభవన్ ఎస్ బిఐ బ్యాంక్ ఎదుట ఉద్యోగుల సమ్మె

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని విధానం అమలు చేయాలని తమ న్యాయమైన డిమాండ్ తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. మంగళవారం నగరంలోని ప్రగతినగర్ శాఖ ఎస్ బిఐ వద్ద బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మార్చి 2024లో జరిగిన 12వ వేతన సవరణ చర్చల సందర్భంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ డిమాండ్ ను అంగీకరించి ఒప్పందం చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడం వల్ల బ్యాంక్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.  ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సిబ్బంది కొరత, అధిక పని భారం, లక్ష్యాల ఒత్తిడి, డిజిటలైజేషన్ పేరుతో పెరుగుతున్న బాధ్యతలు ఉద్యోగులపై తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడిని కలిగిస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పని వ్యక్తిగత జీవన సమతుల్యత కల్పించాల్సిన అవసరం అత్యవసరంగా మారిందన్నారు. ఇప్పటికే ఆర్ బిఐ, ఎస్ఈబీఐ, ఎల్ఐసి, నాబార్డు, ఐఆర్ డీఏ తదతర ఆర్థిక సంస్థల్లో వారానికి 5 రోజుల పని విధానం అమలులో ఉండగా, బ్యాంకు ఉద్యోగులకు మాత్రం దీనిని అమలు చేయకపోవడం అన్యాయమని యూఎఫ్ బీయూ స్పష్టం చేస్తోందన్నారు. 5 రోజుల పని విధానం తక్షణమే అమలు చేయాలని, ఐబీఏతో కుదిరిన ఒప్పందాలను గౌరవించి అమలు కోసం, బ్యాంకు ఉద్యోగుల పని భారం తగ్గించాలనే డిమాండ్ల సాధన కోసం సమ్మె అనివార్యమైంది. ప్రజలు, ఖాతాదారులు ఈ ఉద్యమానికి సహకరించి బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వాలని యూఎఫ్ బియూ విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ యూఎఫ్ బీయు, ఎన్ సీబీ రమేష్, ఎఐబీఓఎస్ నాయకులు రాజు, సింగరావు, గురునాథ్, ప్రమోద్, ఎఐబీఈఏ నాయకులు మనోజ్ సింగ్, ఇతర బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఇఫ్ట్ భూమన్న, ఎఐటియూసి  నాయకులు ఓమయ్య, పదవి విరమణ పొందిన ఉద్యోగులు శ్రీధర స్వామి, వంశీ, ఓంకార్, క్రాంతి, జగన్, ఉదయ్, అన్వేష్, రాధా, మేఘన, శ్రుతి, నిశికాంత్, నాగభూషణం, కిషన్ రావు తదితరులున్నారు.