Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 3:30 pm Posted by : ramakrishna

కొత్త పంతుళ్లకు అందని మొదటి వేతనం

. కరువైన ఉద్యోగం వచ్చిందనే ఆనందం

. పక్క జిల్లాల్లో వేతనాలు అందుకున్న కొత్త టీచర్లు

. నిజామాబాద్ జిల్లాలో 450 మందికి అందని వైనం

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ: ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఉద్యోగాలు సాధించిన కొత్త టీచర్లకు మొదటి నెలలోనే నిరాశ ఎదురైంది. తమతోపాటు పక్క జిల్లాల్లో ఉద్యోగాలు సాధించిన వారికి జీతాలు అందగా, నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 450 మంది కొత్త టీచర్లకు జీతాలు అందలేదు. కొత్త ఉద్యోగాల్లో చేరిన టీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా ట్రెజరరీకి పంపించామని, డీటీవో నుంచి ఎంప్లాయీ ఐడీ రావాల్సి ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతుండగా, ట్రెజరరీ అధికారులు మాత్రం తమ వద్దకు పంపిన వాటన్నింటికీ ఎంప్లాయీ ఐడీలను ఇచ్చేశామని చెబుతున్నారు. కొత్త సాలరీస్  ప్రాసెస్ లో పర్మినెంట్ రిటైర్మెంట్ అంకౌట్ నంబర్ (ప్రాన్) చేయాల్సి ఉంటుదని, ఒక్క అప్లికేషన్ కు ప్రాన్ చేయాలంటే  సుమారు 30 నిమిషాల సమయం పడుతుందని అంటున్నారు. ఈ ప్రక్రియను ట్రెజరరీ ఆఫీసుల్లో చేయడం జరుగుతుందని సర్వర్ బిజీ కారణంగా సిస్టంలో ప్రాన్ చేయడానికి చాలా సమయం పడుతోందని కంప్యూటర్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పక్క జిల్లాల్లో ప్రాన్ ప్రాసెస్ ఎలా పూర్తి చేశారని, మన జిల్లాలో ఆన్ లైన్ ప్రాన్ ప్రాసెస్  ఎందుకు కావడం లేదని కొత్త టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఉపాధ్యాయుల జీతభత్యాల డాక్యుమెంటేషన్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు ప్రభుత్వం అప్పగించగా అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీ ఆలస్యమైందని కొందరు చెబుతున్నారు. డాక్యుమెంట్స్ ప్రాసెసింగ్ మొదట్లో  కంప్లీట్ చేసే  ప్రక్రియ ఆలస్యమైనందున డీటీవోలో ప్రాన్ ప్రాసెస్ కు సమయం పడుంతోందని, పక్క జిల్లాల్లో విద్యాశాఖలోని కొత్త ఉపాద్యాయుల వారి వారి పరిధి ఎంఈవో, కాంప్లెక్స్ హెడ్ మస్టార్ల వద్ద ఫార్మాలిటీని సరియైన సమయంలో పూర్తి చేసిన కారణంగా ఆ జిల్లాల ఉపాధ్యాయులకు జీతాలు అందాయని చెబుతున్నారు. ఏది ఏమైనా కొత్త ఉపాధ్యాయులకు ప్రాన్ ప్రాసెస్ పూర్తి అయితే తప్ప వేతనాలు అందేలా లేవు.  దసరా పర్వదినాన కొలువులిచ్చి సంతోషంలో  ప్రభుత్వం ముంచెత్తగా, అధికారుల అలసత్వం కారణంగా తమకు మొదటి జీతం అందడం ఆలస్యమవుతోందని కొత్త టీచర్లు నిరాశకు గురవుతున్నారు.

శాఖపరమైన ఫార్మలిటీస్ పూర్తి చేశాం

. అశోక్, డీఈవో

జిల్లాలో నూతనంగా భర్తీ చేసిన డీస్సీ ఉపాధ్యాయుల వేతనాలకు సంబంధించిన ఫార్మలిటీస్ అన్నిటినీ శాఖ పరిధిలో పూర్తి చేసి డీటీవో కు పంపించాం. అక్కడి నుంచి ఎంప్లాయీ ఐడీ రావాల్సి ఉంది. డీటీవో నుంచి ఎంప్లాయీ ఐడీ, పర్మినెంట్ రిటైర్మెంట్ అంకౌడ్ నంబర్ లు  రావడమే తరువాయి. కొత్త ఉపాద్యాయుల వేతనాలు వారి అంకౌట్లలో జమవుతాయి.