- ధాన్యం కొనుగోళ్ళకు సివిల్ సప్లయ్ టార్గెట్ ఫిక్స్
- రికవరీ మాత్రం రెవెన్యూ శాఖకు అప్పగింత
- 93 మిల్లులకు రెవెన్యూ రికవరీ యాక్టు నోటీసులు జారీ అయ్యాయా?
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళకు పౌర సరఫరాల శాఖ జిల్లాల వారీగా టార్గెట్ లను ఫిక్స్ చేసింది. ఈ సీజన్ లోనూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకే ప్రథమ స్థానం దక్కింది. జిల్లాల వారీగా విభజించినప్పటికీ నిజామాబాద్ 6,79,234 టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం విధించింది. 4వ స్థానంలో కామారెడ్డి జిల్లా 4,51,528 టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం నిర్ధేశించింది. నిజామాబాద్ జిల్లాలో 633 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 425 కేంద్రాలలో ధాన్యం సేకరణకు వినియోగించనున్నారు. ఈసారి సన్నాలు, దొడ్డురకాలు కలిపి కొనుగోళ్ళను జరుపనున్నారు. ధాన్యం కొనుగోళ్ళకు అవసరమైన సామాగ్రిని జిల్లాలకు సరఫరా చేసేందుకు పౌర సరఫరాల శాఖ లక్ష్యం నిర్ధేశించింది. టార్పలిన్లు, ప్యాడి క్లీనర్లు, మాయిశ్చరైజర్ కొలిచే మిషన్లు, వేయింగ్ మిషన్లు, గ్రెయిన్ కాలిఫర్లను కూడా సరఫరా చేయాలని ఆ శాఖాధికారులు నిర్ణయించారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ధాన్యం సేకరణ లక్ష్యం దండిగా విధించగా బయట కమిషన్ ఏజంట్లు, ప్యాడి వ్యాపార్ల కొనుగోళ్ళను పరిగణలోకి తీసుకుంటే లక్ష్యం 2 లక్షలు అదనమని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుండగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ దక్కుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం మొదటి స్థానం దక్కడం ఆనవాయితీగా వస్తుంది. సేకరణ కూడా అదే స్థాయిలో మొదటి స్థానం నిలుస్తూ జిల్లాకు పేరు ప్రతిష్టలను సాధించి పెడుతున్నారు. అయితే వడ్లను మర ఆడించి (మిల్లింగ్) చేసి బియ్యం అప్పగించే విషయంలో పౌర సరఫరాల శాఖ, డీఎం సివిల్ సప్లయ్ శాఖలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు రెండు ప్రభుత్వ శాఖలు ఆ ఘనతను తెచ్చిపెట్టాయి. నిజామాబాద్ జిల్లాలో 2014-15 నుంచి 2022-23 సంవత్సరాలకు సంబంధించి 44 మిల్లుల నుంచి 250 కోట్ల విలువైన బియ్యం, కామారెడ్డి జిల్లాలో 49 మిల్లుల నుంచి 45 కోట్ల విలువైన సీఎంఆర్ రికవరి పెండింగ్ లో ఉంది. నిజామాబాద్ జిల్లాలో మిల్లర్లు, అధికారులు వాటాలు వేసి పంచుకున్న చందంగా ధాన్యంను పోటీ పడి మిల్లర్లకు అప్పగించారు. తీరా రికవరికి వచ్చేసరికి పర్సంటేజిలు ఇచ్చామని మిల్లర్లు పౌర సరఫరాల శాఖకు మొండిచేయి చూపారు. ఈ విషయంలో జిల్లాలో అదనపు కలెక్టర్ తో పాటు పౌర సరఫరా శాఖాధికారులపై క్రిమినల్ కేసులు నమోదయిన ఘనత ఉంది. గతంలోనూ విజిలెన్స్ సోదాలలో రైసుమిల్లులో వడ్ల గింజ లేని విషయాలు బహిర్గతమైంది. అప్పటికప్పుడు రెవెన్యూరికవరి యాక్టు ప్రయోగించిన ముందస్తుగా మిల్లర్లతో మిలాఖత్ అయిన అధికారులు వారిని కోర్టుకు వెళ్లమని ఉచిత సలహాను ఇచ్చేసి తప్పించుకున్నారు. పేరుకు కోర్టు కేసులు అని చెబుతున్న అధికార యంత్రాంగం ఎందుకు వాటిని వెకెట్ చేయించలేదనడానికి సమాధానమే లేదు. సీఎంఆర్ అప్పగించని మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టామని చెప్పి అధికార యంత్రాంగం సడిచప్పుడు చేయడం లేదు. ఇటీవల ధాన్యం సేకరణ లక్ష్యం విధించినప్పుడు బ్లాక్ లిస్టులో ఉన్న వారికి కేటాయింపులు జరిగాయా లేదా అనే విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. మొన్నటికి మొన్న పౌర సరఫరాల శాఖ చేయాల్సిన పనులను రెవెన్యూకు బదులాయిస్తూ సీఎంఆర్ మొండి బకాయిదారులకు రెవెన్యూ రికవరి యాక్టు బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో 93 మిల్లులకు ఇప్పటికి నోటీసులు జారీ అయ్యాయనే విషయం కూడా ఎక్కడా బహిర్గతం కావడం లేదు. ఈ విషయంలో పౌర సరఫరా శాఖాధికారులు కొనుగోళ్ళు ప్రారంభం కానున్నాయి. బిజీ అయ్యామనే సంకేతాన్ని ఇచ్చి తప్పించుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి.