Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 9:05 pm Posted by : ramakrishna

ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం

 

లింగంపేట, బతుకమ్మ :

 

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేద యువకుడికి హైకోర్టు న్యాయవాది ఆర్థిక సాయం అందించి ఉదారత చాటుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట గ్రామానికి చెందిన లంబడి శ్రీనివాస్‌ (చిన్న) గత నెలలో రాత్రి సమయంలో గోపాల్‌పేట నుంచి ద్వి చక్రవాహనంపై వస్తున్నారు. మార్గమధ్యలో రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పలపై కప్పిన నల్లటి టార్పాలిన్‌ కవరు చీకటిలో కనిపించక పోవడంతో వాహనం అదుపు తప్పి దానిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న విషయం తెలుసుకున్న లింగంపేట మండల కేంద్రానికి చెందిన హైకోర్టు న్యాయవాది మోహిన్‌ ఖాద్రీ వాట్సాప్ సందేశం ద్వారా వెంటనే స్పందించారు. ఆయన సూచనల మేరకు వారి కుటుంబ సభ్యుడు కాసిఫ్‌ మహ్మద్‌ ఖాద్రీ స్థానిక యువకుడు సునీల్‌ ద్వారా శ్రీనివాస్ కుటుంబానికి రూ. 25,000 నగదును అందజేశారు. బాధితుడు పూర్తిగా కోలుకునే వరకు ఎల్లవేళలా అండగా ఉంటానని న్యాయవాది భరోసా కల్పించారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో ముందుంటున్న మోహిన్ ఖాద్రీని పలువురు గ్రామస్థులు, యువకులు అభినందించారు.