. పనికి మాలిన రాజకీయాలు పక్కన పెట్టండి
. అడవి మామిడిపల్లి ఆర్ వో బీ ప్రశ్నార్థకమైంది
. ఇక్కడి నిధులను గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది
. కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు
. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో కొనసాగుతున్న ఆర్ వో బీ, ఆర్ యూబీ పనులకు కేంద్ర నిధులు విడుదల చేయగా, అడవి మామిడిపల్లి వద్ద కొనసాగుతున్న పనుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఒక్క మాధవనర్ ఆర్ వో బీ పనులు మాత్రమే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్నాయని, మిగతా పనులన్నింటికి కేంద్రమే నిధులు ఇచ్చిందన్నారు. దిశ సమావేశం అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడారు. అడవి మామిడిపల్లి ఆర్ వో బీకి కేంద్రం మంజూరు చేసిన రూ.18 కోట్ల నిధులను గత ప్రభుత్వం మళ్లించడంతో పనులు నెమ్మదించాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి తాము విన్నవిస్తుండడంతో కొద్దికొద్దిగా నిధులను మంజూరు చేస్తోందన్నారు. డెవలప్ మెంట్ పనులకు సంబంధించిన ఫైళ్లు ముందుకు కదలకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మీనిధులు, మా నిధులు అంటూ సమయాన్ని వ్రుథా చేయొద్దని. పనులు చేయించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేయొద్దన్ని తాము విన్నవిస్తున్నామన్నారు. మాధవనగర్, అడవి మామడిపల్లి, ఆర్మూర్ మామిడిపల్లి పనులను వేగవంతం చేయించాలన్నారు. నిజామాబాద్ – ఆర్మూర్ రోడ్డు విస్తరణ పనులను టీవీ సీరియల్ ను తలపిస్తున్నాయని విమర్శించారు.
పాఠశాల విద్యను నిర్లక్ష్యం చేశారు
పాఠశాల విద్యను గత ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. 20 కోట్ల రూపాయలు 40 పాఠశాలల్లో అదనపు గదులు, క్రీడా మైదానాలు, టాయిలెట్లు తదితర పనుల కోసం కేంద ప్రభుత్వ నిధులు పీఎం శ్రీ కింద మంజూరైనట్లు తెలిపారు. పనులకు సంబంధించిన ప్రణాళికపై రివ్యూ చేశామన్నారు.
అమృత్ నిధులు రూ.335 కోట్లు
అమృత్ పథకం కింద ఈ మధ్య నిజామాబాద్ నగరానికి రూ.217 కోట్లు, బోధన్ కు రూ.50 కోట్లు, ఆర్మూర్ కు రూ.43 కోట్లు, భీమ్ గల్ కు రూ.25 కోట్లు మొత్తం రూ.335 కోట్లు జిల్లా కు మంజూరైనట్లు తెలిపారు. ఆయా పనులకు సంబంధించి పురోగతిపై చర్చించామన్నారు. అలాగే నిజామాబాద్ నగరంలో 2009 నుంచి అండ్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. రివైజ్డ్ ప్రణాళికలతోనైనా ఈ పనులకు మోక్షం కలగాలను భగవంతుడిని కోరకుందామన్నారు. అలాగే అటవీ, కాంపా నిధులు, పీఎం విశ్వకర్మ దరఖాస్తులు, గ్రామీణ సడక్ యోజనకు సంబంధించి 11 పనులపై రివ్యూ చేశామని ఎంపీ వివరించారు. ఆయా పనులకు సంబంధించి నివేదికలను తమకు అందజేయాలని కలెక్టర్ కు సూచించామన్నారు.