Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 9:27 pm Posted by : ramakrishna

ముందస్తుగానే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులు

 

. . . విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయకూడదు

 

. . . సీఎం రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్‌, బతుకమ్మ :

 

ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులను ప్రతి ఏటా ముందస్తుగానే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థుల ఖాతాల్లోనే ముందుగానే నిధులు జమ చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లో హెచ్ఎండీఏ మైదానానికి ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించి వారికి నివాళులర్పించారు. అనంతరం హెచ్ఎండీఏ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు నిలిపివేయడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులు అడగకుండానే వారి ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు జమ చేసేలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో నిధులను సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా సుమారు రూ.2,400 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. గతంలో ఇంజనీరింగ్‌ లేదా వైద్య విద్యలో డిగ్రీ ఉంటే ఉద్యోగాలు లభించేవని, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని అన్నారు. కేవలం సర్టిఫికెట్లు కాకుండా నైపుణ్యాలు ఉన్నవారికే మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు ఆ తర్వాతి దశలో నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏటీసీలు, పాలిటెక్నిక్‌ విద్య, స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు ఇతర సాంకేతిక విద్యా అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తే జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా పెరిగిందని, చాలామంది 90 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్నారని అన్నారు. చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, క్రీడలు, ఇతర ప్రతిభా రంగాల్లో రాణించే విద్యార్థులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ దాగి ఉందని, “మట్టిలో మాణిక్యాలు” ఉన్నాయని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ద్వారా క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోటి రూపాయల వరకు నగదు బహుమతులు అందించే విధానాన్ని తీసుకురానున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌, క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌, అథ్లెట్‌ దీప్తి జీవాంజి వంటి క్రీడాకారులను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడల్స్‌ సాధించి, ఒలింపిక్స్‌ లో పతకాలు సాధించేలా యువత కృషి చేయాలని అన్నారు. ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించే బాధ్యత తనదేనని సీఎం పేర్కొన్నారు. చదువు, నైపుణ్యాలే జీవితాలను మార్చగలవని రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివితే అమెరికాలో ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం సాంకేతిక విప్లవం కారణంగా పరిస్థితులు వేగంగా మారుతున్నాయని చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కారణంగా ఇంజనీరింగ్‌, గ్రాడ్యుయేషన్‌, ఐటీ రంగాల్లోని కొన్ని ఉద్యోగాలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మార్పులను ఎదుర్కొనేందుకు యువతను భవిష్యత్‌ నైపుణ్యాలతో సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాల మధ్య అంతరాలను తగ్గించి, అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట కలిసి చదువుతూ, జీవించేలా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్య ద్వారా సామాజిక సమానత్వాన్ని సాధించడమే ఈ విధానం లక్ష్యమన్నారు. జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం కేవలం జయంతి, వర్ధంతులను నిర్వహించేందుకే కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. వారి త్యాగాలు, పోరాటాలు, సామాజిక సంస్కరణల నుంచి భవిష్యత్‌ తరాలు స్ఫూర్తి పొందేలా ఈ విగ్రహాలు నిలవాలని ఆకాంక్షించారు. మహనీయుల స్ఫూర్తితో విద్యలో రాణించడంతో పాటు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, మహ్మద్‌ అజారుద్దీన్‌, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.