నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని ప్రైవేటు కళాశాల సిబ్బంది అన్నారు. ఈ విషయమై సోమవారం ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు కలెక్టరేట్ ముఖద్వారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి వెంటనే ప్రభుత్వం స్కాలర్ షిప్ డబ్బులను విడుదల చేసి తమను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ డబ్బులు రాకపోవడంతో తమకు తమ కళాశాలలు గత ఆరు నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. ప్రస్తుతం తమకు పూట గడవడం కూడా కష్టం అవుతుందని అధ్యాపక, సహాయక సిబ్బంది బాధపడ్డారు. ముస్లిం మైనార్టీ సిబ్బంది రంజాన్ పండుగ ముందు చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేస్తే తమకు కళాశాలలు జీతభత్యాలు చెల్లిస్తే రాబోయే పండుగను సంతోషంగా చేసుకుంటామని లేకపోతే ఈ పండుగకు కూడా పస్తులు ఉండాల్సిందేనని తమ అశక్తతను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, దేవారెడ్డి, అనురాధ, కౌసర్ బేగం, సందేశ్, సందీప్, చందన్ సింగ్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
