Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 4:11 pm Posted by : ramakrishna

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

  • విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
  • విద్యార్థుల మహా ప్రదర్శన

 

బోధన్, బతుకమ్మ: పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్ఈపీ 2020 నీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  విద్యార్థి మహా ప్రదర్శన బోధన్ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా  పీ.డీ.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న సుమారు 8వేల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల చెల్లింపులో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య పద్ధతులనే, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించడం బాధాకరమన్నారు. వేల కోట్ల రూపాయల ఫీజులు బకాయిలతో ఇబ్బందులు పడుతున్న యాజమాన్యాలు,  విద్యార్థుల వద్ద ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులు, సర్టిఫికెట్లు అందక పైచదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు పేద, మధ్యతరగతి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతను తెలియజేస్తున్నాయని ఆరోపించారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోవైపు గురుకులాలు, కేజీబీవీలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు సౌకర్యాలు కల్పించకుండా, ఫీజుల దోపిడికీ పాల్పడుతున్నాయన్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల బకాయిలను చెల్లించాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే  పీ.డీ.ఎస్.యు ఆధ్వర్యంలో  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు.  ప్రభుత్వ విద్యాసంస్థల్లో పుస్తకాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదన్నారు. బెస్ట్ అవైలబుల్ 200 కోట్లు ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు. అన్ని గురుకులాలు, కేజీబీవీలకు సొంత భవనాలు, ప్రభుత్వ స్కూళ్లల్లో టాయిలెట్స్, స్వచ్ఛమైన తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలను కల్పించాలన్నారు.  ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డిమాండుకు అనుగుణంగా సీట్లను పెంచాలన్నారు. సొంత భవనాలు నిర్మించాలన్నారు. విద్యార్థులకు ఫ్రీ బస్ పాసులు ఇవ్వాలని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గౌతం కుమార్, ఏఐఎఫ్డిఎస్ జిల్లా కన్వీనర్ మోసిన్, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు నాగరాజు,  పి.డి.ఎస్.యు. జిల్లా నాయకులు నసీర్, సందీప్,సృజన్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దినేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు, పిడిఎస్యు జిల్లా నాయకులు సాయినాథ్, శ్రీకాంత్,ఏఐఎస్బి జిల్లా నాయకులు శంకర్,రాజన్న, నాగరాజు, విద్యార్థులు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.