Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 8:00 pm Posted by : ramakrishna

హత్యాయత్నం కేసులో తండ్రికొడుకులకు పది సంవత్సరాల జైలు శిక్ష

 

. . . పది వేల జరిమానా

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

నాన్న కాలం జేసిండు. కాలంతో కలిసి వచ్చిన నాన్న ఉద్యోగం వారసత్వంగా వచ్చింది. ఆస్తి, ఉద్యోగం గురించి అన్నదమ్ముల మధ్య లొల్లి. రాజీ ప్రతిపాదికన పెద్దల సమక్షంలో రాజీ. రాజీకి ససేమి అన్న తమ్ముడు. గోరుతో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకున్నారనేది అనేది పాత సామెత. గోరుతో పోయేది రాడ్ దాకా తెచ్చుకున్నాడు అనేది కొత్త సామెత. పెద్దల మాట సద్దన్న మూట అని పెద్దలు వట్టిగనే అనలేదు. పెద్దలు కుదిరిచ్చిన రాజీ పద్ధతి అదే మధ్యవర్తిత్వం కాదుపొమ్మన్నడు. రాడు తీసిండు, రక్తం చిమ్మించిండు. అఖరుకు కొడుకుతో కలిసి పదేళ్ల కారగార శిక్షకు గురైండు. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన నిజమైన కథ. నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం పది మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి, ఎనిమిది ధ్రువీకరించుకున్న పత్రాలు, ఒక వస్తుగత సాక్ష్యాన్ని మార్క్ చేసి, ముద్దాయిల తరపున డిఫెన్స్ సాక్ష్యం నమోదు చేసుని, ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాది వాదనలు విని నలభై పేజీల తీర్పు వెలువరించిన న్యాయస్థానం తీర్పు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట్ మండలం బినోల గ్రామానికి చెందిన నీరడి గంగాధర్, నీరడి చిన్న గంగాధర్ అన్నదమ్ములు. వీరి తండ్రి హన్మాండ్లు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించారు. తండ్రి మరణాoతరం చిన్న గంగాధర్ ఎలాగోలా గ్రామ రెవిన్యూ అధికారిగా ఉద్యోగం వారసత్వంగా సంపాదించుకున్నాడు. వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్థి, ఉద్యోగం విషయంలో అన్న తమ్ముడి మధ్య పంచాయతీ ఉన్నది. కుల పెద్దల సమక్షంలో 25 జనవరి, 2025 న మౌఖిక రాజీ పరిష్కారం చేసుకున్నారు. జనవరి 28 తేదిన పెద్దల ముందు పేపర్స్ మీద వ్రాసుకుని ఒప్పందంపైన సంతకాలు చేసుకుందామని మాట్లాడుకున్నారు. ఒప్పందం విషయంలో తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అవి తనకు సమ్మతం కావని గొడవ చేసి చిన్న గంగాధర్ వెళ్ళిపోయాడు. ఆస్థి పంపకాలతో పాటు వారసత్వంగా వచ్చిన ఉద్యోగంను నష్ట పోవలసి వస్తుందనే కోపంతో, కక్షతో సాయంత్రం ఐదు గంటలకు చిన్న గంగాధర్ ఇనుప రాడ్ తో అన్న గంగాధర్ తలపై, కుడి భుజంపై కొట్టి తీవ్రంగా గాయపరచి హత్యయత్నం చేశారు. అడ్డుపడిన అతని భార్య లలితను చిన్న గంగాధర్ కొడుకు దేవేందర్ రాడ్ తో తలపై కొట్టి తీవ్రంగా గాయ పరచాడు. గంగాధర్ కుమారులైన  ప్రసాద్, శ్రీకాంత్ లను చిన్న గంగాధర్ అతని కుమారుడు దేవేందర్ రాడ్ తో కొట్టి హత్యయత్నం చేశారని, ఇద్దరు ముద్దాయిలైన చిన్న గంగాధర్, దేవేందర్ ల ఉమ్మడి లక్ష్యం ఉన్నదనె నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు జడ్జి దుర్గా ప్రసాద్ తమ తీర్పులో ధ్రువీకరించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109 (1) హత్యయత్నంకు గాను పది సంవత్సరాల కఠిన కారగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించారు. ఇద్దరు ముద్దాయిల ఉమ్మడి లక్ష్యం ఉన్నదనే నేరం రుజువు అయినందున సెక్షన్ 3(5) ప్రకారం మరో పది సంవత్సరాల, పది వేల రూపాయల జరిమానా విదిస్తూ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తీర్పు చెప్పారు. శిక్షలన్ని ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తమ తీర్పులో పేర్కొన్నారు.

 

Father and son sentenced to ten years in prison for attempted murder