Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 6:29 pm Posted by : ramakrishna

దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుంది

 

. . . సీపీఐ (ఎం.ఎల్) నగర కార్యదర్శి ఎం.సుధాకర్

 

. . . రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతి సభను జయప్రదం చేయండి

 

. . . సామ్రాజ్యవాదం ఫాసిజం లకు వ్యతిరేకంగా ఉద్యమించండి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుందని, నిరుద్యోగం, పేదరికం, అసమానతలతోపాటు, సకల రంగాలలో సంక్షోభాలు ఎదురవుతున్నాయని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. భారత విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) 10వ వర్ధంతి సభ పోస్టర్లను పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపంథా పోరాట యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 10న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “ప్రస్తుత ప్రపంచం – యుద్ధ వాతావరణం”,  ఫాసిజం – ప్రజాస్వామిక పోరాటం,  “భారతదేశంలో నేటి పరిస్థితి” తదితర అంశాలపై ప్రసంగ పాఠాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద యుద్దోన్మాద వైఖరితో యుద్ధం చేస్తున్నదన్నారు. మరోప్రక్క మత ఉన్మాదం, మత విద్వేషం కట్టలు తెంచుకుని ప్రజల మీద స్వైర విహారం చేస్తున్నదన్నారు. విద్య, సంస్కృతి, చరిత్ర, వివిధ పౌర ప్రజాస్వామిక సంస్థలనూ, వ్యవస్థలనూ మొత్తం కాషాయీకరించి జర్మనీ తరహా నాజీయిజంను దేశంలో తీసుకువచ్చే యత్నాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. పత్రికా వ్యవస్థ, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాల నుంచి న్యాయ వ్యవస్థ దాకా వున్న కనీస ప్రజాస్వామిక పిల్లర్లను ఆక్రమించుకుని దేశాన్ని ఉన్మాదపూరితంగా మారుస్తున్నదన్నారు. అదానీ, అంబానీ లాంటి కొద్ది మంది కుబేరుల, అమెరికా లాంటి సామ్రాజ్యవాదుల బడా పెట్టుబడి, ఫైనాన్స్ క్యాపిటల్తో మోడీ, షాల పాలన దేశంలో ఫాసిజానికి బాటలు పరిచిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బానిసగా భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నడుపుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే మన దేశంపై విధించిన అధిక తారీకు మాట్లాడకపోవడం, ఇరాన్ సుప్రీమ్ హత్యపై కనీస ప్రకటన చేయకపోడమన్నారు. ఈ స్థితిలో సామ్రాజ్యవాదం వ్యతిరేక, ఫాసిస్టు వ్యతిరేక పోరాటం ప్రతీ ప్రజాస్వామికవాది, లౌకికవాది, కమ్యూనిస్టుల కర్తవ్యం కావాలన్నారు. ఆ పోరాట కర్తవ్యాలను నిర్దేశించుకుని, ఐక్య పోరాటాలు నిర్మిద్దామన్నారు. ఆ లక్ష్యసాధనలో భాగంగా కామ్రేడ్ రవన్న 10వ వర్ధంతి సందర్భంగా ఈనెల 10న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రసంగ పాఠాలు ఏర్పాటు చేసామన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలు ప్రజాస్వామికశక్తులను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్, నగర కార్యదర్శి వినోద్, టియుసీఐ జిల్లా నాయకులు లింగం, విటల్, గంగాధర్, పిడిఎస్యు నాయకులు శివ పాల్గొన్నారు.