Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 7:28 pm Posted by : ramakrishna

రైతులకు విరివిగా సేవలందించాలి

  • జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా విస్తృత స్థాయిలో సేవలు అందించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం సాయంత్రం ఉద్యానవన శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, నిర్దేశిత లక్ష్యాలు, సాధించిన ప్రగతి, రైతులకు అందిస్తున్న తోడ్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో పసుపు పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నందున రైతులకు మేలు రకానికి చెందిన, అధిక దిగుబడిని అందించే నాణ్యమైన పసుపు వంగడాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కావడం వల్ల రైతులకు మేలు చేకూరుతుందని, పసుపు పరిశోధన కేంద్రం, స్పైస్ పార్క్ ద్వారా కూడా రైతులు ప్రయోజనం పొందేలా చూడాలన్నారు.  అదేవిధంగా ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 5600 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారని, ఈ విస్తీర్ణం గణనీయంగా పెరిగేలా కృషి చేయాలన్నారు. ఈ ఏడాది 3000 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 979 ఎకరాలలో సాగు చేపట్టేందుకు రైతులు సంసిద్ధత తెలుపుతూ తమ వాటా మొత్తాన్ని డీ.డీల రూపంలో చెల్లించారని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్ పరికరాలను అందించడంతో పాటు, విత్తనాలను కూడా అందిస్తోందని, పంట నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం ఒక్కో ఎకరానికి 4200 రూపాయల చొప్పున వారి ఖాతాలలో నిధులు జమ చేస్తోందని తెలిపారు. ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో పాటు, విత్తనాలు అందించిన కంపెనీలే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తాయని, కోతులు వంటి అటవీ జంతువుల బెడద ఉండదని, ఒకసారి పంట వేసుకుని మూడు సంవత్సరాల పాటు నిర్వహణ చేపడితే సుదీర్ఘ కాలం పాటు గణనీయమైన ఆదాయం లభిస్తుందని అన్నారు. ఇలా అనేక ప్రయోజనాలు కలిగిన ఆయిల్ పామ్ పంట గురించి క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి, స్వచ్చందంగా వారు ముందుకు వచ్చేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశం జిల్లా ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.