. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నందున రైతులకు ఈ విషయమై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. రక్షిత మంచినీటి సరఫరా, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, ప్రజాపాలన తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పై అంశాలకు సంబంధించి వివిధ జిల్లాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని, చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కంది, సజ్జ, కొర్రలు, కూరగాయలు వంటి పంటలు పండించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కాగా, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాల్లో పూర్తిస్థాయిలో విద్యార్థుల ప్రవేశాలు జరిగేలా సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానికంగా ఉండే నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించు కోవాలని హితవు పలికారు. తాగునీరు కలుషితం కాకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
