బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలంలోని ఖండ్‌గాం గ్రామం వరద ముప్పులో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం చుట్టూ నీరు చేరడంతో రవాణా పూర్తిగా ఆగిపోయింది. బయటకు వెళ్లే అన్ని రహదారులు నీటితో మునిగిపోవడంతో ప్రజలు ఒక రకంగా బంధీ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ – “ఖండ్‌గాం గ్రామం చుట్టూ నీరు చేరి గ్రామస్తులు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావడం కష్టమైపోతోంది. అధికారులు వెంటనే స్పందించి నిల్వ ఉన్న నీటిని పంపించే చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని పంట పొలాలు వరద నీటితో మునిగిపోయాయి. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం తక్షణమే పరిశీలించి రైతులకు తగిన నష్టపరిహారం అందించాలి” అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ బోధన్ పట్టణ కార్యదర్శి వీరేష్, గ్రామ యువకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.