Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 7:51 pm Posted by : ramakrishna

బిచ్కుందలో రైతు మహోత్సవ కార్యక్రమం

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం బిచ్కుంద మండలంలోని రైతు వేదికలో రైతు మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిచ్కుంద మున్సిపాలిటీ చైర్ పర్సన్ సీమ రమేష్ షెట్కార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ గురించి వివరించారు. నేల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మట్టి నమూనా తీసే విధానం గురించి వివరించారు. రసాయన ఎరువులు ముఖ్యంగా అధిక మోతాదులో యూరియా వాడడం వల్ల మన ఆరోగ్యానికి, పర్యావరణానికి, నేలకు కలిగే నష్టాల గురించి వివరిస్తూ ప్రత్యామ్నాయంగా వివిధ రకాల సేంద్రియ ఎరువులు, నానో యూరియా వాడుకోవాలని రైతులకు సూచించారు. అదే విధంగా వానకాలంలో ప్రభుత్వం నిర్ణయించిన తొమ్మిది రకాల సన్న వడ్లు మాత్రమే రైతులు పండించుకొని క్వింటాల్ కి 500 రూపాయలు చొప్పున సన్న వడ్లకు బోనస్ పొందగలరని రైతులకు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతుల క్షేత్రాల నుంచి గ్రామానికి 10 చొప్పున మట్టి నమూనాలు సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపించారు. ఆ మట్టి పరీక్ష కార్డులను నేటి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కవిత ప్రభాకర్ రెడ్డి, బిచ్కుంద మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్, బిచ్కుంద మున్సిపల్ కౌన్సిలర్లు ధర్పల్ గంగాధర్, నౌషా నాయక్, ముజాహిద్, మారుతి పటేల్, వాజిద్ నగర్ గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి శివలింగ్ రైతులు పాల్గొన్నారు.