. . . 14 మోటార్ కేబుళ్ల చోరీ
భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి శివారులో సామల రాజిరెడ్డి బావి నుంచి ఏనుగు భూపతి బావి వరకు గల సుమారు 2 కిలోమీటర్ల మేర వ్యవసాయ పంపుసెట్ల వద్ద గుర్తు తెలియని దుండగులు 14 మోటార్ కేబుళ్లను బుధవారం చోరీ చేసి పరారయ్యారు. రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దుండగులు కేబుళ్లను కటర్‌తో తెగకొట్టి కాల్చి రాగి తీగల తీసుకువెళ్లారు. తెల్లవారుజామున పొలాలకు వెళ్లిన రైతులు మోటార్లు ఆగిపోవడంతో గమనించి చూడగా కేబుళ్లు తెగిపడి ఉన్నాయి.

ఒక్కొక్క కేబుల్ విలువ సుమారు 8 వేల నుంచి 10 వేల వరకు ఉండటంతో మొత్తం రూ.1 లక్ష వరకు నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు.ఈ చోరీ కారణంగా సుమారు 30 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న పంటలకు సాగునీరు అందక ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై బాధిత రైతులు భిక్కనూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అనిల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాత్రి సమయంలో గస్తీని పెంచాలని, దొంగలను వెంటనే పట్టుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
