Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 7:06 pm Posted by : ramakrishna

ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ రైతు

 

. . . యూరియా ఎరువుల కోసం ఆందళనకు దిగిన రైతులు

 

రాజంపేట, బతుకమ్మ :

 

యూరియా లేక, పంటలకి ఎరువుగా ఏం వేయాలో తెలియక మనస్తాపానికి గురైన ఒక రైతు తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు, ఇతర రైతులు అప్రమత్తమవడంతో ఆ రైతు ప్రాణాలతో బయట పడ్డాడు. రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో యూరియా ఎరువుల కోసం రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన యూరియాను కూడా పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ లో కాకుండా నేరుగా తమకు యూరియా అందించాలని ఒక్కసారిగా సొసైటీ ఆవరణంలోకి దూసుకొచ్చారు. తమకు పెద్ద 5జీ ఫోన్లు లేవని తాము యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలని రైతులు వాపోయారు.  యూరియా కొరత కారణంగా పంటలకు ఏమి మసాలాలు వేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగినంత యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న వ్యవసాయ శాఖ అధికారులు డివిజనల్ వ్యవసాయ అధికారి అపర్ణ మండల వ్యవసాయ అధికారి జ్యోత్స్న ప్రియదర్శిని, సీఈఓ వెంకటేశ్వర శర్మ రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి రైతులను శాంతింప చేశారు.