Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 11:28 pm Posted by : ramakrishna

వైద్యులకే కోట్లకు ఎసరు పెట్టిన ఫేక్ ఐఏఎస్

  • మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసమని పెట్టుబడులు పెట్టించి చీటింగ్
  • రెండు నెలలుగా పత్తా లేకుండా పోయిన తమిళనాడు వాసీ
  • లబో దిబోమంటున్న ఇందూర్ వైధ్యులు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రైవేట్ వైద్యులకు ఫేక్ ఐఏఎస్ కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టాడు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలలో రాత్రనక, పగలనక కష్టపడి కూడబెట్టిన కోట్ల రూపాయలను దాచి మెడికల్ కాలేజీలో భాగస్వామ్యం అని ఫేక్ ఐఏఎస్ చేతిలో పోసి భంగపడ్డారు.  కోట్ల రూపాయాలను పెట్టుబడి పెట్టామని అడ్మిషన్ ల సమయంలో తాము పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని స్థోమతకు మించి డబ్బులు ఇచ్చి మోస పోయిన వైద్యులు లబోదిబోమంటున్నారు. తమ వద్ద ఉన్నదానికి పన్నులు కట్టకపోవడంతో తాము మోసపోయామని ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక సతమతమౌతున్నారు. కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేని దుస్థితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఒక్క నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వైద్యులు, ఇతరులు దాదాపు 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు మోసపోయిన వ్యవహరం ఆలస్యంగా వెలుగు చూసింది.

తనకు ప్రధాన మంత్రి కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయని, తాను కలెక్టర్ గా పని చేశానని చెప్పుకున్న తమిళనాడుకు చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో ఓ మెడికల్ కాలేజీని తెరిపిస్తున్నాని తెలంగాణకు చెందిన ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల డైరెక్టర్ ద్వారా జిల్లాలో అడుగుపెట్టినట్టు తెలిసింది. సదరు రావు ద్వారా ఒక అర్కిటెక్చర్ ఆయన ద్వారా ఒక వైధ్యుల సంఘం నేత పరిచయం అయినట్టు సమాచారం. వారి ద్వారా నిజామాబాద్ నగరంలోని ప్రముఖ వైద్యులు, వైద్య సంఘం నేతలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, జనరల్ ఆసుపత్రిలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు తలా కొంచం అంటు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. మూసి వేసిన ఆసుపత్రిని త్వరలో తెరిపిస్తామని దానికి ఒక అనస్థీషియా వైద్యుడిని సూపరింటెండెంట్ గా నియమించి నెలకు నాలుగు లక్షల వేతనం ఫిక్స్ చేశారు. దానికి తోడు పెట్టుబడి పెట్టిన వైద్యులు కుడా డాక్టర్ లు రెండు నెలలు పనిచేశారు. నర్స్ లు, టెక్నిషయన్ లు, నాన్ టెక్నికల్ స్టాఫ్ ను సైతం నియమించారు. తరువాత కాలంలో వారికి వేతనాలు చెల్లించు సమయంలో సదరు ఆసుపత్రి చైర్మెన్ గా చెప్పుకున్న వ్యక్తి ఇచ్చిన చెక్కు చెల్లకుండా పోయింది.  అదే సమయంలో భారత వైద్య మండలి టీం పరిశీలన వ్యవహారం ఇవ్వాల, రేపు అంటు వాయిదా పడటంతో మోసపోయిన విషయం గుర్తించడంలో ఆలస్యమైంది. వైద్యుల నుంచి సెక్యూర్టి గార్డుల వరకు వేతనాలను తమ సొంత డబ్బులను వెచ్చించిన వైద్యులు ఇతరులు తమిళనాడు వాసి కోసం ఆరా తీస్తుండగానే తరువాత కాలంలో అతడు కనిపించకుండా పోయాడు. తాము మోసపోయామని బాధిత డాక్టర్ లు ఆలస్యంగా గుర్తించిన అప్పటికి అరవ మెళం సరిహద్ధులు దాటినట్లు తెలిసింది.

నిజామాబాద్ నగరంకు చెందిన వైద్యులకు, డయగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులకు, మెడికల్ నిర్వాహకులకు, చివరకు కాంట్రాక్టర్ మొదలుకొని ఆర్కిటెక్చర్ వరకు మోసం చేసి చెప్పా పెట్టాకుండా బిచాణా ఎత్తివేసిన వ్యవహరం మెడికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. కాని డబ్బులు పెట్టుబడి పెట్టిన వైద్యులు మాత్రం కిక్కురుమనకుండా ఉండటం గమనార్హం. మూతబడిన మెడికల్ కళాశాల పున: ప్రారంభం వ్యయ ప్రయాసలు తెలియకుండానే వైద్యులు మోసపోయారా అనే చర్చ జరుగుతుంది. ముందుగా పథకం ప్రకారం తమకు రాజకీయ ప్రముఖుల అండ ఉందని త్వరలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ లు వస్తాయని నమ్మించడంతో వైద్యులు సులువుగా మోసపోయినట్లు తెలిసింది. ప్రముఖ వైద్యుల సంఘం నేతనే తాను పెట్టుబడి పెట్టానని, మీరు పెట్టండని నమ్మకం కలిగించడంతో వైద్యులు, మెడికల్, టెక్నికల్, నాన్ టెక్నికల్, చివరకు కాంట్రాక్టర్ లు కుడా సులువుగా మోసగాడి వలలో చిక్కి మోసపోయినట్టు తెలిసింది. అందరు వైద్యులు సదరు మెడికల్ కళాశాల యాజమాన్యం వద్దకు వెళ్లగా తమిళనాడు వాసితో జరిగిన లావాదేవీల వ్యవహారంలో తప్పులు జరుగడంతో ఎంఓయూ రద్ధు చేసుకున్నట్టు తెలుపడంతో చావు కబురు చల్లగా చెప్పినట్టయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వైద్యులను మోసగాళ్లే కాకుండా స్థానికులు కుడా నోట్ల మార్పీడి సమయంలో మోసాలకు పాల్పడి ముంచేశారు. ఒక వైద్యుడు డీమాటైజేషన్ టైంలో జిల్లా కేంద్రానికి చెందిన నేతకు కోట్ల రూపాయలు ఇచ్చి మోసపోయి దాని ఒత్తిడిలో స్టంట్ లు పడిన విషయం ఆనాడు కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇందూర్ జిల్లాలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగస్వాములు అవుతామని తాము పెట్టిన పెట్టుబడి నాలుగింతలుగా రాబట్టుకోవాలన్న వైద్యుల దురాశ దుఖానికి చేటులా మిగిలింది.