- ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ.శరత్
- కలెక్టర్ తో కలిసి చంద్రాయణపల్లి కొనుగోలు కేంద్రం తనిఖీ
- ఇంటింటి సర్వే, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష
నిజామాబాద్, బతుకమ్మ : ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ ఏ.శరత్ తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి గురువారం ఇందల్వాయి మండలం చంద్రాయణపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి శరత్ తనిఖీ చేశారు. రైతులను పలుకరించి, ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా, ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించిన రైతులు రోజుల తరబడి వేచిచూడాల్సి పరిస్థితి ఉత్పన్నం కాకుండా, ధాన్యం తూకం జరిపించాలని అధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించాలని, రవాణాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. సన్నరకం, దొడ్డురకం ధాన్యానికి సంబంధించి ఈసారి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ అందించనున్న దృష్ట్యా దొడ్డు రకం, సన్నరకం ధాన్యం కలిసిపోకుండా చూడాలని, కొనుగోళ్ల వివరాలను కూడా వేర్వేరుగా ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు. ట్యాబ్ ఎంట్రీ సకాలంలో పూర్తయితేనే, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. సంబంధిత అధికారులు అనునిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం కొనుగోళ్ల తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ జరపాలన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా అవసరమైన ప్రాంతాలలో గోడౌన్లను గుర్తించాలని అన్నారు. ధాన్యం సేకరణలో గన్నీ బ్యాగులు వంటి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 433772 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేయగా, అందులో అత్యధికంగా 3.71 లక్షల ఎకరాలలో సన్న ధాన్యం సాగు చేశారని ప్రత్యేక అధికారికి వివరించారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని, ఇందులో 80 శాతానికి పైగా సన్న ధాన్యం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల నుండి సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 673 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. వీటిలో సన్న ధాన్యం సేకరణ కోసం 439 కేంద్రాలను, దొడ్డురకం ధాన్యం కొనుగోళ్ల కోసం 234 కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ప్రస్తుతం 370 కేంద్రాలలో రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటదివెంట నిర్దేశిత రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. బోధన్, బాన్సువాడ ఏరియాలలో మరో మూడు వారాల వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగనుండగా, బాల్కొండ తదితర ప్రాంతాలలో పంట దిగుబడులు కొంత ఆలస్యంగా వచ్చినందున డిసెంబర్ 15 వరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచాల్సి వస్తుందని ప్రత్యేక అధికారి దృష్టికి తెచ్చారు.
నిర్ణీత గడువు లోపు ఇంటింటి సర్వేను పూర్తి చేయాలి : ప్రత్యేక అధికారి శరత్

ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ.శరత్ సూచించారు. స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన జిల్లా అధికారులతో సమావేశమై ఇంటింటి సర్వే ప్రగతిని సమీక్షించారు. ప్రతి నివాస గృహాన్ని ఎన్యూమరేటర్లు సందర్శించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో పక్కాగా కుటుంబ వివరాలు సేకరించేలా చూడాలన్నారు. సర్వే ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని, తప్పిదాలకు తావు లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోపే సర్వే పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు. ఒక్కో ఎన్యూమరేటర్ ప్రతిరోజూ సగటున 15 ఇళ్లను సందర్శించి సర్వే ద్వారా వివరాలను సేకరించేలా చూడాలన్నారు. ఇంటింటి సర్వే, ఆన్లైన్ లో వివరాల నమోదు ప్రక్రియలను ఏకకాలంలో సమాంతరంగా చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెల 9 నుండి సమగ్ర కుటుంబ వివరాల సేకరణ కోసం అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామని, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను అన్నివిధాలుగా సన్నద్ధం చేశామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నివాస గృహాల సంఖ్యకు అనుగుణంగా 3247 ఎన్యూమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేసి, అంతే సంఖ్యలో ఎన్యూమరేటర్లను నియమించామని, పర్యవేక్షణ కోసం 356 మంది సూపర్వైజర్లను నియమించామని వివరించారు. నిర్దిష్ట గడువులోపు సర్వే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రత్యేక అధికారి వెంట ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం రాజేశ్వర్, డీసీఓ శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగూరావు తదితరులు ఉన్నారు.
