Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 5:29 pm Posted by : ramakrishna

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

. . . అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు గాను శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ, ఈ నెల 21వ తేదీ లోగా పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారికి సూచించారు. అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండాలని ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, అంబులెన్స్, ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

Extensive arrangements for Republic Day celebrations
Extensive arrangements for Republic Day celebrations