Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 7:02 pm Posted by : ramakrishna

గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వచ్చే ఏడాది 2027 జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులు, సదుపాయాలను గుర్తిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో మంగళవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్ బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉంటాయని, వీటితో పాటు అనువైన ప్రాంతాలలో మరిన్ని ఘాట్లను గుర్తించవచ్చని అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కర ఘాట్ల వద్ద వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను పరిశీలించి, ఆయా శాఖల వారీగా సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు  సమర్పించాలన్నారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున అన్ని అంశాలను నిశితంగా పరిశీలన జరపాలన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆర్టీసీ ఆర్.ఎం జ్యోత్స్న, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Extensive arrangements for Godavari Pushkaram