- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్ పహాల్గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాద చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలి అనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేసి నిజామాబాదు జిల్లాలో పాకిస్థాన్ పౌరసత్వం ఉన్న వ్యక్తులను వెళ్లగొట్టాలని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం జిల్లా పోలీస్ కమీషనర్ సాయి చైతన్యకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి మాట్లాడుతు నిజామాబాదు జిల్లాలో పాకిస్తాన్ పౌరసత్వం, చెల్లుబాటు కానీ వీసాలతో నివసించే వారిని గుర్తించి వారిని బహిష్కరించాలని సీపీకి సూచించారు. గతంలో నిజామాబాదులో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పట్టుపడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తూ అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేసి వారిని గుర్తించాలని సూచించారు. నగర అంతర్గత శాంతి భద్రతలకు విఘతం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం పాలిత రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయడం లేదు అన్నారు. దీని మూలాన ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లే అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఈ దేశ పౌరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.