- హెచ్ డీఎస్ లేక ఇంచార్జీల పాలన
- ఆసుపత్రిలో పని చేయని కీలక విభాగాలు
- పట్టించుకునే నాథుడే కరువు
- నిధులు కేటాయించి నెలలు గడుస్తున్నా మరమ్మత్తులు కరువు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. 2016 నుంచి ప్రారంభమైన ఇంచార్జి అధికారుల పాలన కొనసాగుతునే ఉంది. ప్రభుత్వాలు మారినా, ఎమ్మెల్యేలు, ఎంపీలు మారినా హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ (హెచ్ డీఎస్) ఏర్పాటు జరుగకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న నిజామాబాద్ జీజీహెచ్ కు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం పేషెంట్లు వస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి నిర్వాహణను పాలకులు పట్టించుకోకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. తమను ఎవరు ఏమి అనరు, ఏమి చేయలేరన్న ధీమాతో ఇంచార్జిలే మళ్ళీ తమ కింది స్థాయి వారికి ఇంచార్జి బాధ్యతలను అప్పగిస్తూ తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.
నిజామాబాద్ జీజీహెచ్ లో 750 పడకల ఆసుపత్రిగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అని రికార్డులకు పరిమితమైంది. జీజీహెచ్ లో కోట్ల విలువ చేసే క్యాథలాబ్ ఉన్నా కార్డియాలజిస్టు లేక అది మూలనపడింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడంతో జీజీహెచ్ అనుబంధంగా క్రిటికల్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దాని కోసం ప్రత్యేక భవనం నిర్మించి సంవత్సరాలు గడిచినా దానిని ప్రారంభించి వైద్య సేవలు అందించే వారే లేరు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ప్రసూతి కేంద్రం లేకపోవడంతో జీజీహెచ్ అనుబంధంగానే మధర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్ (ఎంసీహెచ్) ను ఇటీవల కాలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రారంభించారు. అయితే వైద్యులు, సిబ్బంది లేరన్న సాకుతో కొన్ని రోజులకే దానికి తాళం వేశారు. ఇటీవల ఈ విషయంపై విమర్శలు రావడంతో ఓపీని ప్రారంభించారు. నిజామాబాద్ జీజీహెచ్ లో టీ హబ్ ఉండగా ఒకప్పుడు అక్కడ 60 రకాల పరీక్షలను నిర్వహించేవారు. ఇప్పుడు టీ హబ్ లో అందుతున్న సేవలను వేళ్ల మీద లెక్కపట్టవచ్చు. నిజామాబాద్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ కొరకు ఎన్నొ రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే పేదలను ఆసుపత్రికి సంబంధించిన వైద్యులే ఎంఆర్ఐ స్కానింగ్ కావాలని కోరుతూ ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
నిజామాబాద్ జీజీహెచ్ లో ఇంచార్జి అధికారుల ఒంటెద్దు పోకడలు పరాకాష్టకు చేరాయి. నిబంధనలకు విరుద్దంగా ఫుడ్ కాంట్రాక్ట్ ను బీనామీలకు ఇచ్చారన్న అపవాదు, ఫిర్యాదులు ఉన్నా తిరిగి పాత కాంట్రాక్టర్ కే అప్పగించిన ఘనత అధికారులది. ఆసుపత్రిలో సూపరింటెండెంట్లు మారినప్పుడల్లా తాత్కాలిక ఉద్యోగులు మారడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో పని చేసిన సూపరింటెండెంట్ హెచ్ డీఎస్ అనుమతి లేకుండా నియమించిన కొందరికి వేతనాలు చెల్లించిన విషయం బహిర్గతం కావడంతో వారిని పక్కకు తప్పించారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసిన ప్రజాప్రతినిధి తాలుకు సిఫారసుల పేరుతో వారి సీసీ చాలా మందిని ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేసిన ఉదంతం ఉంది. జీజీహెచ్ లో అనర్హులు అర్హత లేకున్నా ఉద్యోగాలు చేయిస్తున్నారంటే అది సూపరింటెండెంట్ లకే దక్కింది. కంప్యూటర్ ఆపరేటర్లకు ఉండాల్సిన అర్హత లేకపోయినా ఓపితో పాటు కార్యాలయంలో పని చేయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆసుపత్రిలో లిఫ్ట్ ల మరమ్మత్తులు ప్రహాసనంగా మారింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆసుపత్రి నిర్వాహణను చూసి ఇంచార్జి సూపరింటెండెంట్ పై ఫైర్ అయ్యారు. తర్వాత మరో ఇంచార్జి సూపరింటెండెంట్ ను నియమించిన ఆసుపత్రి అధికారుల వ్యవహర శైలి మారలేదు. ఇంచార్జిలే ఇంచార్జి బాధ్యతలను అప్పగిస్తున్న పరిస్థితి జీజీహెచ్ లో నెలకొంది. జీజీహెచ్ లో మరమ్మత్తు కోసం మూడున్నర కోట్లు సాంక్షన్ చేసి నెలలు గడుస్తున్నా అధికారులు ఎస్టిమేషన్, టెండర్లకే పరిమితం కావడంతో ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయోనన్న చర్చ జరుగుతుంది.