. ఎత్తొండ సహకార సొసైటీలో రూ.12 కోట్లు పక్కదారి
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా సహకార సొసైటీలలో అవినీతి అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో గతంలో పేరెన్నిక గన్నతాళ్లరాంపూర్ సొసైటీలో కోట్ల కొలది అక్రమాలు బయట పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ఎత్తొండ సొసైటీలో దాదాపు రూ.12కోట్లు పక్కదారి పట్టాయి. అదేవిధంగా కోటగిరి మండలంలోన పోతంగల్ సొసైటీలో అక్రమాల నేపథ్యంలో పాలకవర్గాన్ని రద్దు చేశారు.
సొసైటీల్లో ప్రత్యేక పేరున్నఎత్తొండ విశాల సహకార సంఘం ఇప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. సొసైటీలో అవకతవకలు జరుగుతున్నాయని సభ్యులే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేయించిన ఉన్నతాధికారులు అవకతవకలు జరిగింది వాస్తవమేనని తేల్చారు. పాలకవర్గ సభ్యులతోపాటు కార్యదర్శి నిధులను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. సివిల్ సప్లయీస్ ధాన్యం 43,664.10 క్వింటాళ్లకు గాను ప్రస్తుతం కేవలం 4,254.15 క్వింటాళ్లు మాత్రమే ఉంది. 39409.95 క్వింటాళ్ల ధాన్యం లెక్క తేలాల్సి ఉంది. ఈ లెక్కన రూ.9064885 విలువైన ధాన్యం సివిల్ సప్లయీస్ వారికి అప్పగించాల్సి ఉంది. అలాగే బీపీటీ, హెచ్ఎంటీ, జైశ్రీరాం తదితర రకాల 1742 క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టింది. దీని విలువ సుమారు రూ.52,26,000 ఉంటుంది. ఎరువుల విక్రయం ద్వారా వచ్చిన రూ.56,96,332 మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకున్నారు. ఎస్ఏవో, ఎంటీవో, ఐటీ అప్పుల తాలూకు బ్యాంకుకు చెల్లించాల్సిన, సభ్యుల నుంచి రావాల్సిన మొత్తానికి రూ.30,87,719 వ్యత్యాసం ఉండగా, ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి రూ.14,31,000, సేవింగ్స్ ఖాతాకు సంబంధించి రూ.54,08,000 చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం 12,59,86,259 అవినీతి జరిగినట్లు విచారణాధికారి తేల్చారు.
. . . పొతంగల్ సొసైటీ పాలక వర్గం రద్దు
నిజామాబాద్ జిల్లాలో కార్యకలాపాలు, ఆస్తులు, అప్పుల విషయంలో గత కొన్ని రోజులుగా వివాదాల్లో ఉన్న పోతంగల్ సొసైటీకి జిల్లా అధికార యంత్రాంగం షాక్ ఇచ్చింది. రైతులకు సంబంధించి నాలుగు కోట్ల వరకు లోటు బడ్జెట్ ను చూపించి నిధులు పక్కదారి పట్టించిన ఆరోపణల నేపథ్యంలో సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కార్యదర్శి భరత్ కుమార్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు, సభ్యుల ఫిర్యాదుల నేపథ్యంలో స్పందించిన ఉన్నతాధికారులు పాలకవర్గానికి నోటీసులు జారీ చేశారు. దాదాపు రెండున్నర కోట్ల జీఎస్టీ చెల్లింపులు జరుగక నిధులు ఆగిపోయినట్లు సమాచారం. కార్మికులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులు జరుగక పోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అదేవిధంగా పాలకవర్గం దాదాపు రూ.50లక్షల మేర నిధులు లెక్కలు చూపలేదు. పాలకర్గం నుంచి సమాధానం లేకపోవడంతో రద్దు అనివార్యమైనట్లు సమాచారం. ఆస్తుల ఎన్ని ఉన్నాయో అప్పులు కూడా ఉన్నాయని అదేవిధంగా నిర్వహణ వైఫల్యంతో పాలక వర్గం పదవి కాలం ఉండగానే రికవరీ స్టేజీకి దారితీసింది. ఇప్పటి వరకు పాలకవర్గం స్పందించకపోవడంతోనే అర్థాంతరంగా రద్దు చేయించినట్లు తెలిసింది. అయితే డీసీవో ఆఫీస్ అధికారి రియాజుద్దీన్, కోటగిరి డీసీసీబీ అధికారి వెంకటేశ్వరరావుకు సంఘం నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.