Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2024, 8:29 pm Posted by : ramakrishna

సర్వేకు ప్రతీ ఒక్కరు సహకరించాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈరోజు నుండి 8 వ తేది వరకు మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేయడం జరుగుతున్నదని, ఎన్యూమ రెటర్స్ తమకు కేటాయించిన ఎన్యూమరేషన్ బ్లాక్ లో పర్యటించి గృహాలను సందర్శించి కుటుంబాల జాబితా రాసి ప్రతీ గృహంపై స్టిక్కర్స్ అంటించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో ఎన్యుమారేషన్ కోసం 2366 మందిని ఇన్యుమ రేటర్ గా నియమించామని, 237 మందిని సూపర్వైజర్ లుగా నియమించామని తెలిపారు. జిల్లా మొత్తంలో 2,90,462 కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందన్నారు. ప్రతీ ఎన్యుమరేటర్ గ్రామీణ ప్రాంతంలో 150, పట్టణ ప్రాంతంలో 125 కుటుంబాలను కేటాయించడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో 2023, పట్టణంలో 350 ఎన్యూమరేషన్ బ్లాకులుగా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎన్యుమా రెటర్లకు, సూపర్వైజర్లకు పూర్తిస్థాయి శిక్షణ ఈ నెల 5 న ఇవ్వడం జరిగిందని తెలిపారు. మండల స్థాయిలో సర్వే మానిటరింగ్ కోసం మండల ప్రత్యేక అధికారులను నోడల్ అధికారులుగా, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను  నోడల్ అధికారిగా నియమించామని తెలిపారు. సర్వే లో భాగంగా రెండవ దశలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని, ఎన్యూమరెటర్లు 8 పేజీలు కలిగిన 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు కలిగిన మొత్తం 75 ప్రశ్నలు కలిగిన వివరాలు ఆయా కుటుంబాల నుండి వివరాలు సేకరిస్తారని తెలిపారు. కుటుంబ యజమాని వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారి వివరాలు కూడా సెకరిస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానంగా వివరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీపీఒ రాజారాం, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్ పాల్గొన్నారు.