Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 1:21 pm Posted by : ramakrishna

భారీ వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి

 

. . . సీ.పీ సాయి చైతన్య తో కలిసి వరద ఉద్ధృతిపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 సమీక్ష

నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :

రానున్న 48 గంటల పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలు కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఉదయం నుంచి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితిని సమీక్షించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు, వాగులు తెగిపోయాయి, ముంపునకు గురైన నివాస ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి, క్షేత్రస్థాయి అధికారులకు  తక్షణ సహాయక చర్యలపై దిశా నిర్దేశం చేశారు. వరద ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు, తండాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలను కూడా మైకుల ద్వారా అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన గ్రామాలలో తక్షణమే విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలన్నారు.

Everyone should be alert in the wake of heavy rains

రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అత్యావసరం అయితేనే ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ మేరకు అన్ని నివాస ప్రాంతాల్లో టాంటాం, మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వద్దకు ప్రజలు ఎవరూ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేపల వేట, ఈత కోసం చెరువులు, కాలువలు, రిజర్వాయర్లోకి దిగకుండా కట్టడి చేయాలని, అవసరమైన చోట పోలీసు బందోబస్తు, పికెటింగ్ లను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా జేసీబీలు, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.