. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాదు డివిజన్ పరిదిలో జరగనున్న సందర్బంగా బందోబస్తు ఏర్పాట్ల విషయమై సోమవారం కమీషనర్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాదు డివిజన్ పరిధిలో గల సమస్యాత్మకమైన, అతి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్ ని గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి, ప్రచారం గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి వీలు లేకుండా అంతర్ రాష్ట్ర , అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సంబంధిత పోలీసు సిబ్బంది ఆయా ప్రదేశాలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు తెలియజేశారు. ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించి నటువంటి పోలింగ్ బూతు లో సక్రమమైన విధులు నిర్వహించాలని, ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తం పూర్తి అయ్యే వరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విధినిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, నిజామాబాదు ఏ.సి.పి బి. ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, టౌన్ సి. ఐ శ్రీనివాస్ రాజ్, నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్, ఎలక్షన్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
