. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా భద్రత, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నారై సమస్యల పరిష్కారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులతో పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా శాంతిభద్రతలు, ప్రజల భద్రత, విద్యార్థుల రక్షణ, ట్రాఫిక్ క్రమశిక్షణ, డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, పట్టణాభివృద్ధి, ఎన్నారైలకు సంబంధించిన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో డ్రగ్స్ నియంత్రణ, ట్రాఫిక్ అవగాహన, ఈవ్‌టీజింగ్ నివారణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీలు ఆయా సంస్థల యాజమాన్యాలతో పాటు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, ఈవ్‌టీజింగ్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్-100 / 1903కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. విద్యార్థుల రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాలను విద్యాసంస్థలకు తీసుకువస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మైనర్లు వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పోలీస్ కమిషనర్ కోరారు. పరిశుభ్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటు, అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తత వంటి అంశాల్లో ప్రజలు పోలీస్ శాఖతో కలిసి పనిచేయాలని సూచించారు. ఇటీవల ఎన్నారైలకు సంబంధించిన మోసాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. విదేశాల్లో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులు మోసాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఎన్నారైలకు సంబంధించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. సమాజంలో సురక్షితమైన, మాదకద్రవ్యాల రహిత, మహిళలకు భద్రత కలిగిన, ట్రాఫిక్ క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఏర్పడాలంటే పోలీస్ శాఖతో పాటు విద్యాసంస్థలు, సెక్యూరిటీ కౌన్సిల్, తల్లిదండ్రులు, ప్రజలు సమిష్టిగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎన్‌ఎస్‌సీ సెక్రటరీ డాక్టర్ కవిత రెడ్డి, ట్రెజరర్ సంతోష్, జాయింట్ సెక్రటరీలు రజనీకాంత్, శిరీష్, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఉష, దుష్యంత్, హితాని, రాజీవ్ దువా, ఇనాని తదితర ఎన్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు.