- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్ లో విధిగా నమోదు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్ లో నిక్షిప్తం చేయిస్తోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వివరాల నమోదులో ఎవరు కూడా అలసత్వం వహించకూడదని, యుద్ధ ప్రాతిపదికన దీనిని పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్ డేషన్ చేయించి, యూడైస్ లో వివరాలు నమోదు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి అపార్ జెనరేట్ చేయాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలలో కూడా వివరాల నమోదు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తయ్యేలా చూడాలన్నారు. గడువు లోపు వివరాలు నమోదు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, యూడైస్ వివరాలతో సరిపోలి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రతి విద్యా సంస్థ విధిగా పాటించాలని, బడి పిల్లలకు సామర్థ్యానికి మించి బరువుతో కూడిన బ్యాగులు లేకుండా చూడాలన్నారు. విద్యార్థుల భద్రతకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మెట్ల మీదుగా పై అంతస్తులోని తరగతి గదులకు వెళ్ళాల్సి ఉన్న పాఠశాలల్లో మెట్లకు ఇరువైపులా పటిష్టమైన రెయిలింగ్ ఉండాలని అన్నారు. విద్యా సంస్థల్లో సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు, సిబ్బంది హాజరును ముఖ గుర్తింపు విధానం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఐఈఓ రవికుమార్, డీఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
