బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమికవేక వ్యవసాయ సహకార సంఘంలో రుణాలు తీసుకున్న అర్హత కలిగిన ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేయాలని రైతులు మహాజనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మాల్ తుమ్మెద సొసైటీ అధ్యక్షుడు దుండిగల్ల నర్సింలు ఆధ్వర్యంలో రైతులతో మహాజనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈఓ సందీప్ 1-04-2024 నుండి 10-03-2025 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలను సభలు సభ్యులకు చదివి వినిపించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి మూడు అంశాలపై తీర్మానం చేయడం జరిగిందని సొసైటీ అధ్యక్షులు దుండిగల్ల నర్సింలు తెలిపారు. రెండు లక్షల వరకు అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, మాల్తుమ్మెద గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం కోసం నూతన భవన నిర్మాణం, మాల్తుమ్మెద గేటు సమీపం వద్ద సహకార సంఘానికి కొనుగోలు చేసిన స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే సౌకర్యార్ధం ధర్మకాంట ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు గుర్రాల సిద్దయ్య, కృష్ణవేణి రాజారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, నరేష్, మాజీ సొసైటీ చైర్మన్ రాంచంద్రా రెడ్డి, సొసైటీ సీఈవో సందీప్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.