Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 5:55 pm Posted by : ramakrishna

చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు

 

. . . డా. మోసిన్, న్యూరో ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వేసవిలో చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే, పెద్ద సమస్యలను నివారించవచ్చు అని డా. మోసిన్, న్యూరో ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ తెలిపారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, డీహైడ్రేషన్ కారణంగా శరీరంతో పాటు మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయనన్నారు. ముఖ్యంగా వృద్ధులు, బీపీ, షుగర్, హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో శరీరంలో నీటి లోపం ఏర్పడటం వల్ల మెదడుకు సరిపడ రక్త ప్రసరణ తగ్గి తలనొప్పి, తల తిరగడం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. తీవ్రమైన పరిస్థితుల్లో హీట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో వేసవిలో లక్షణాలు మరింత పెరుగుతాయని, ఎక్కువ వెలుతురు, వేడి వాతావరణం కారణంగా తీవ్ర తలనొప్పులు రావచ్చని వివరించారు. అలాగే మూర్ఛ వ్యాధి ఉన్న రోగులు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం, నీటి లోపం రాకుండా జాగ్రత్తపడడం చాలా ముఖ్యమని సూచించారు. తలనొప్పి, తల తిరగడం, కళ్ల ముందు చీకటి కనిపించడం, ఒక్కసారిగా చేతులు లేదా కాళ్లు బలహీనంగా మారడం, మాట తడబడటం లేదా మాట్లాడటంలో ఇబ్బంది, గందరగోళం, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరమని ఆయన హెచ్చరించారు. రోజుకు కనీసం 3 – 4 లీటర్ల నీరు త్రాగాలని, మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లడం తగ్గించాలన్నారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగు ఉపయోగించాలని, తేలికపాటి, పోషకాహారం తీసుకోవాలని, కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి పానీయాలను తగ్గించాలని తెలిపారు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలని, సరిపడ నిద్ర తీసుకోవడం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.