Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 11:08 pm Posted by : ramakrishna

స్పౌస్ ఉన్నా రానివ్వలే..

  • ఆరోగ్యం బాలేదన్నా కనికరించలే
  • జిల్లాను దాటించి ప్రాణం పోయేలా చేసారు
  • గాల్లో కలిసిన ఎమ్మార్వో విజయ్ కుమార్ ప్రాణాలు
  • రెవిన్యూ నాయకులతో వేగలేకపోతున్న ఉద్యోగులు

 

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని రెవిన్యూ నాయకుల తీరు వల్ల ఇంకెన్ని ప్రాణాలు పోతాయోననే ఆందోళన ఉద్యోగులలో కనబడుతోంది. వారి స్వార్థపూరిత ఆలోచనలతో కొందరు సంఘాన్ని వాడుకొని ఇక్కడే ఉండిపోతున్నారు. వీరి కన్ను పడిన సీటును ఖాళీ చేయించి చేమ్చాలకు అప్పగించుకుంటున్నారు. ఇలాంటిదే ఆర్మూర్ లో గతంలో డిఏఓ గా పని చేసిన విజయ్ కుమార్ ను తప్పించి సంఘ నాయకునికి ఇప్పించుకున్నారు. ఆరోగ్యం బాగాలేదని, చివరికి స్పౌస్ ఉంది జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని మొరపెట్టుకున్నా కనికరించలేదు. బాధను దిగమింగుకొని విధులకు వెళ్దామంటే అనారోగ్యం మృత్యు రూపంలో కబళించింది.

  • జిల్లాను దాటించి….

శాసనసభ ఎన్నికల సమయంలో అర్మూర్లోని డివిజనల్ కార్యాలయంలో డిఏఓ గా విజయ్ కుమార్ బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. రెవిన్యూ సంఘంలోని ఒకరికి ఆ స్థానంలో పోస్ట్ ఇప్పించేందుకు విజయ్ న్ నిర్మల్ కు బదిలీ చేయించారు. అంతలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆదిలాబాద్ కు పంపించారు. ఈయన సతీమణి ఉపాద్యాయురాలు కావడంతో 317 జిఓ లో భాగంగా స్పౌస్ కింద జిల్లాకు వస్తాను పోస్టింగ్ ఇవాలని ప్రాదేయపడ్డారు. వేరే వారికి స్పౌస్ వర్తింపజేసారు గాని విజయ్ కుమార్ కు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. కనికరం లేని నాయకులు కావడంతో కామారెడ్డి జిల్లాకు పంపగా, బాన్సువాడ డివిజనల్ కార్యాలయంలో డిఏఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఇంతలోనే మళ్ళీ వచ్చిన బదిలీల జాబితాలో తన పేరు చూసి అవాక్కయారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఎల్లారెడ్డికి వెళ్ళలేనని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. తప్పదన్నట్లుగా ఎల్లారెడ్డి ఆర్డిఓకు ఫోన్ చేసి సోమవారం వచ్చి విధుల్లో చేరతానని బతిమాలుకున్నట్లు సమాచారం. కలెక్టరేట్ లోని అధికారి ఫోన్ చేసి ఏ రోజు (శనివారం) విదుల్లో చేరాల్సిందే, ఇది కలెక్టర్ ఆజ్ఞ అని ఖరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. ముందే బిపి, షుగర్ వ్యాధులతో పోరాటం చేస్తున్న ఎమ్మార్వో విజయ్ కుమార్ మనస్తాపానికి లోనైనట్లు సమాచారం. అవే ఆలోచనలతో ఉన్న ఆయనకు అదే రోజు గుండెపోటు రావడంతో అనంత లోకాలకు వెళ్ళిపోయాడు.

  • నాయకుల తీరుతో ఇంకెంతమందో ….

రెవిన్యూ సంఘాన్ని వారి స్వలాభాల కోసమే వినియోగించుకుంటున్నారు. తమకు నచ్చినవారు, నాయకుల అడుగులకు మడుగులు ఒత్తే కొంత మంది ఉద్యోగులకు బదిలీలలో వెసులుబాటు కల్పిస్తున్నారు. సకలాంగులు జిల్లా కేంద్రంలో ఉంటే మహిళలు, అనారోగ్యాలతో ఉన్నవారు ఇతర జిల్లాలకు వెళ్ళిపోయారు. అవకాశం ఉండి వస్తామని చూస్తే పరోక్షంగా రాకుండా పావులు కదుపుతున్నారు. కలెక్టరేట్ లో అంతా ఒక కూటమికి చెందినవారే ఉండడంతో ఆడుకున్న ఆటలా తయారయ్యింది. యూనియన్ పేరుతో తన కార్యాలయం మొహం చూడకున్నా నాయకులకు చెల్లుతుంది. పని చేతగానివారు ఎక్కడో ఒక మూలకు పోస్టింగ్ తీసుకుంటే విధులకు రాకపోయినా ఇప్పటి మాదిరిగానే నడిచిపోతుంది. కేంద్రంలో ఉంటూ కార్యాలయాలకు రాకున్నా, ఉన్నతాధికారులు నోరు మెదపకపోవడం చూస్తే అనుమానాలు తలెత్తుతున్నాయని రెవిన్యూ ఉద్యోగులు పేర్కొంటున్నారు. నాయకులమని చెప్పుకొని తిరిగే వారి వల్ల ఇంకెంతమంది బలికానున్నారో అనే అనుమానాలు ఉద్యోగులలో పొడసూపుతున్నాయి. వీరి స్వార్థ ప్రయోజనాల కోసమే జిల్లాలో ఎన్నికల మాట తీయడం లేదనే మాటలు వినబడుతున్నాయి.