Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 8:25 pm Posted by : ramakrishna

నన్ను కాల్చి చంపుతా అన్నా ప్రజల విషయంలో రాజీపడను

 

. . . కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేయొద్దు

 

. . . ప్రజల, రైతుల ప్రయోజనాలే ముఖ్యం

 

. . . బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

 

సికింద్రాబాద్, బతుకమ్మ :

 

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని గాయత్రి గార్డెన్స్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయకుండానే దిగువకు వెళ్తున్న నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. తాను కాంగ్రెస్ పార్టీని లేదా మరే ఇతర పార్టీని విమర్శించేందుకు రాలేదని, పని చేయాల్సిన బాధ్యత ఉన్న వారిని మాత్రమే ప్రశ్నిస్తున్నానని ఈటల స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని, తాను తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల పక్షాన నిలబడతానని చెప్పారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయాలని తాము డిమాండ్ చేయడం లేదని, నదిలోకి వృథాగా వెళ్తున్న నీటిని ఎత్తిపోసి రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు. ఇంజినీర్ల సలహాలతో నిర్ణయాలు తీసుకోవాలని, విమర్శలకు బదులుగా సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌కు ఇప్పటికే రోజుకు సుమారు 107 ఎంజీడీల నీటి కొరత ఉందని, భవిష్యత్తులో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే దానిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చకూడదని ఈటల రాజేందర్ అన్నారు. అవినీతి ద్వారా జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనలను తాము వ్యతిరేకించడం లేదని, అయితే వాటిని ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. బీజేపీ సిద్ధాంతం “దేశం ముందు, పార్టీ తర్వాత, వ్యక్తి చివర” అనే అంశంపై ఆధారపడిందని పేర్కొన్న ఈటల, తాను తెలంగాణ మట్టిబిడ్డగా “తెలంగాణ ముందు, పార్టీ తర్వాత, వ్యక్తి చివర” అనే భావనతో పనిచేస్తానని చెప్పారు. ప్రజలు, రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తాను తలొగ్గనని, ధర్మం కోసం, ప్రజల కోసం చివరివరకు పోరాడుతానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

 

Even if they threaten to shoot me dead, I will not compromise when it comes to the people.