. . . జనరల్ సర్జన్ డా.మనోజ్ కుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఒక చిన్న గాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అది సెల్యులైటిస్‌గా మారి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ జనరల్ సర్జన్ డా.మనోజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో డయాబెటిస్, రక్తప్రసరణ సమస్యలు, గాయాలు, పాదాల పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో సెల్యులైటిస్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్యులైటిస్ అనేది చర్మం, చర్మం కింద ఉండే మృదు కణజాలంలో బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అని, సాధారణంగా కాళ్లు, పాదాలు, చేతుల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. చిన్న గాయం, గీత, పగుళ్లు, పురుగు కాటు వంటి వాటి ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని, ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, రక్తప్రసరణ లోపం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
. . . ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
సెల్యులైటిస్ ప్రారంభ దశలో కాలు లేదా ప్రభావిత భాగం ఎర్రగా మారడం, వాపు రావడం, నొప్పి, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని, కొందరిలో జ్వరం, వణుకు, అలసట కూడా ఉండవచ్చని, ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించి తీవ్ర సమస్యలకు దారితీయవచ్చని తెలిపారు.
. . . నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే
సమయానికి చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి సెప్సిస్, నెక్రోటైజింగ్ ఫాసియాటిస్, గ్యాంగ్రీన్ వంటి ప్రాణాపాయ పరిస్థితులకు దారితీయవచ్చని, కొన్నిసార్లు చర్మం, కండరాలు దెబ్బతిని శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చన్నారు. అందుకే చిన్న గాయమైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరమని తెలిపారు.
. . . నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గాయాలను పరిశుభ్రంగా ఉంచాలని, డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచాలని, పాదాల్లో గాయాలు, పగుళ్లు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలన్నారు. అలాగే పరిశుభ్రమైన పాదరక్షలు ధరించాలని, చర్మంపై గాయాలు లేదా ఇన్ఫెక్షన్ కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.
. . . త్వరగా గుర్తిస్తే బెటర్
కాలు ఎర్రబడటం, వాపు, నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే జనరల్ సర్జన్‌ను సంప్రదిస్తే ప్రారంభ దశలోనే యాంటీబయోటిక్స్ తో చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చన్నారు. చికిత్సలో ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ తీవ్రరూపం దాల్చి శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితి కూడా రావచ్చని, ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చిన్న గాయాన్నైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.