సదాశివనగర్, బతుకమ్మ :
ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న సోలార్ ఉత్పత్తితో వినియోగంతో ప్రకృతిని పరిరక్షించాలని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి కంపెనీ లిమిటెడ్ కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సాలియ నాయక్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల శివారులో అక్షయ్ రెడ్డి సోలార్ ప్రయివేట్ విద్యుత్ ప్లాంట్ ను ఎస్ఈ ఆదివారం కంపెనీ యాజమానులు మంద ప్రకాష్ రెడ్డి, మంద ప్రియతం రెడ్డి, మంద అక్షయ్ రెడ్డి లతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. మొట్టమొదటి సారిగా ప్రైవేట్ రంగంలో రెండు మెగావాట్స్ సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మితం కావడం సంతోషదాయకమన్నారు. సోలార్ విద్యుత్ వలన వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. సూర్యభగవానుని కిరణాల నుండి వచ్చే కాంతులే సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కారణాలు అవుతాయని పేర్కొన్నారు. ప్రజల విద్యుత్ అవసరాలు పెరగడం మూలంగా విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిందని తెలిపారు. దేశ అభివృద్ధికి అవసరమైన పరిశ్రమలకు, డాటా సెంటర్ లకు తదితరాలకు విద్యుత్ చాలా అవసరమైన నేపథ్యంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏకకై వనరు అని సాలియా నాయక్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు తోడుగా ప్రయివేట్ రంగాలు చేదోడుగా నిలిస్తే దేశ ప్రగతి పరుగులు పెట్టి అభివృద్ధి చెందిన దేశంగా వర్దిల్లుతుందని ఆయన అన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి వలన సహజ సిద్ధంగా ఏర్పడిన వనరులను కాపాడుకుని ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన వారం అవుతామని ఆయన వివరించారు. మంద రెడ్డి కుటుంబం దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వలన కామారెడ్డి జిల్లాకు మేలు చేసినవారు అయినారని సాలియా నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డివిజనల్ విద్యుత్ ఇంజనీర్ (ఆపరేషన్స్ )నంద కుమార్,ఎమ్ ఆర్ టి డివిజనల్ ఇంజనీర్ కళ్యాణ్ చక్రవర్తి, టెక్నీకల్ డివిజనల్ ఇంజనీర్ విజయ్ సారథి, కమర్శియల్ అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ దుర్గా ప్రసాద్, ఆపరేషన్ ఎడిఇ నరేష్ కుమార్, ఎఇ గంగాధర్, తెలంగాణ రాష్ట్ర సోలార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, స్వరాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
