- వ్యవసాయ కార్మికులకు షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలి
- ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.రమేష్
సిరికొండ,బతుకమ్మ : ఉపాధి హామీ కూలీలకు బకాయి ఉన్న కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని,వ్యవసాయ కార్మికులకు షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం( ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ డిమాండ్ చేశారు. గురువారం ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించుట, ఆత్మీయ భరోసా అందజేయడం గురించి సిరికొండ ఎంపీడీవో మనోహర్ రెడ్డికి పలు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం ను ఆయన అందజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు రోజువారి కూలి డబ్బులు చెల్లించడంలో నెలల తరబడిగా బకాయి పెట్టడం వల్లవారికి దినదిన గండముగా బతికే దుస్థితి నెలకొన్నదన్నారు. కూలి చేసిన నెలల తరబడి కూలి డబ్బులు రాక పూట గడవని దుస్థితి నెలకొన్నదని,వేసవిలో ఎర్రని ఎండలో పనిచేస్తున్న కూలీలకు చేసిన పని కూలీ చేతికి రాక వస్తవో రావో అన్న తీవ్రమైన ఆందోళనకు గురివుతున్నారని అన్నారు. తక్షణమే ఉపాధి కూలీల బకాయిలను అన్ని గ్రామాల్లో చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12వేలను ఇప్పటికీ అందించలేదని. గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అర్హుల జాబితాను ప్రకటించినప్పటికీ ఇంకా ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో అనేకమంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ అనేక నిబంధనలు పెట్టి కేవలం కొంతమందిని అరకోరగా ఎంపిక చేసి చేతులు దులుపుకునే పని ప్రభుత్వం చేస్తుందని ఆయన విమర్శించారు.గ్రామాల్లో ఉన్న అందరూ వ్యవసాయ కార్మికులకు పూర్తిస్థాయిలో ఆత్మీయ భరోసా కింద రూ.12,000 అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ( ఏఐపికేఎంఎస్) జిల్లా ఉపాధ్యక్షులు బి కిషోర్, సహాయ కార్యదర్శి జి. సాయరెడ్డి, కోశాధికారి ఎస్ కిషోర్, జిల్లా నాయకులు ఎర్రన్న, ఎల్ నరేష్, బి. సర్పంచ్, మండల నాయకులు ఎండి ఖదీర్ తదితరులు. పాల్గొన్నారు.