Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 5:15 pm Posted by : ramakrishna

ఉద్యోగుల అసంతృప్తి మంచిది కాదు

  • పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు క్రుపాల్ సింగ్

 

15247 నిరంతరం ఇటు ప్రజల కోసం అటు ప్రభుత్వం కోసం కష్టపడుతూ రాజ్యాంగబద్ధంగా,హక్కుగా రావాల్సిన కరువు భత్యం పీ ఆర్ సి ప్రయోజనాలు అడిగితే పది లక్షల మందితోతో సభపెట్టి వారినే అడుగుదామంటున్న ముఖ్యమంత్రి మాటలు బాధించాయని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు క్రుపాల్ సింగ్ అన్నారు.  అధికారంలోకి రాగానే పదిహేను రోజులలో పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తామని,ఆరునెలల్లో పీఆర్సి అమలు చేస్తామని ఆరోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో ముఖ్యమంత్రి పలుమార్లు చెప్పిన మాటలు,మేనిఫెస్టో అంశాలుగా చేర్చిన విషయం ఇంకా గుర్తున్నాయన్నారు. మొదటి తారీఖున జీతాలు తప్ప ఇప్పటివరకు ఉద్యోగులకిచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని తెలిపారు. ప్రజలకు కల్పిస్తున్న ఉచిత సంక్షేమ పథకాలు ఎలాగూ ఉద్యోగులకు ఇవ్వట్లేదన్నారు. ఉద్యోగులకు రుణమాఫీ చేయలేదన్నారు. వారి తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్లు రావన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు కారనితెలిపారు. షాదీ ముబారక్ రాదని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు సన్నబియ్యం ఇవ్వరన్నారు. రాజీవ్ యువశక్తి పథకానికి ఉద్యోగుల పిల్లలు అర్హులు కారని తెలిపారు. ఉద్యోగుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరని, వంటగ్యాస్ ఇవ్వరని తెలిపారు. గృహ అవసరాలకు ఉచిత కరెంటు సరఫరా చేయరని, కనీసం మాకు హక్కుగా రావాల్సిన ప్రయోజనాలు అడగకూడదా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కొత్త కొత్త కోరికలు కోరుతున్నారు అన్న పదం వాడారని, ఏంటి కొత్త కోరికలు? కరువు భత్యం ఇవ్వమని అడగడం కొత్త కోరికనా..? హక్కుగా ప్రతి ఐదు సంవత్సరాలకు అమలు చేయాల్సిన పిఆర్సి ఇవ్వమని అడగడం తప్పా..? రోగానికో నొప్పికో, బిడ్డల పెళ్లిళ్లకని,భవిష్యత్తు అవసరాలకోసమని కడుపు కట్టుకొని నోరు కట్టుకొని జిపిఎఫ్ ఖాతాలో దాచుకున్న డబ్బులు ఇవ్వమని అడగడం కొత్త కోరికనా..? తన యవ్వనమంతా ప్రజాసేవకు ధారబోసిన ఉద్యోగి వృద్ధాప్యంలో రిటైర్మెంట్ బెనిఫిట్లు పింఛన్లు ఇవ్వమని అడగడం కొత్త కోరికనా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుటుంబ పెద్దగా బిడ్డల కడుపు ఇషారిచ్చి ఆకలి తీర్చాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ప్రజల్లోకి వెళ్లి అడిగితే ఎవరూ ఇవ్వమని చెప్పరు. ఆనాడు రాష్ట్రంలో 24 అసెంబ్లీ స్థానాలలో ఉద్యోగుల మద్దతుతోనే గెలిచిన విషయం మరవకూడదన్నారు. ముఖ్యమంత్రి మాటలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాస్తవాలు చెబుతున్నట్టు కనిపించినా పరోక్షంగా ఉద్యోగులను బదనాం చేసే విధంగా ఉన్నాయనడం వాస్తవమని అన్నారు. దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. ఉద్యోగుల అసంతృప్తితోనే గత ప్రభుత్వం అధికారం కోల్పోయిన విషయం ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు మరో మారు గుర్తు చేస్తున్నామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉద్యోగుల బాధలు అర్థం చేసుకొని వారికి రావాల్సిన ప్రయోజనాలు త్వరలోనే క్లియర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.