. మోర్తాడ్ ఏడీఈ, ఏఈల పోస్టులు ఖాళీ
. బదిలీపై అధికారి వెళ్తే కొత్త అధికారి వచ్చింది లేదు..
. వచ్చిన కొత్త అధికారులు సెలవులో..
ముగ్గురు రాష్ట్ర కార్పొరేషన్ ల చైర్మన్లు, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో విద్యుత్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకునే వారు లేరు. పూర్తిగా వ్యవసాయ నియోజకవర్గమైన బాల్కొండ లో పరిస్థితి ఇలా ఉంది.
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో ప్రధాన నియోజకవర్గమైన బాల్కొండ పరిధిలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వ్యవసాయానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బాల్కొండ నియోజకవర్గం నుంచి హేమాహేమీలు రాష్ర్టస్థాయి పదవుల్లో ఉన్నా ఇక్కడి విద్యుత్ వ్యవస్థ పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. భీమ్ గల్, మోర్తాడ్, కమ్మర్ పల్లి సెక్షన్ లలో విద్యుత్ అధికారులు లేకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. భీమ్ గల్ పట్టణంలో సబ్ ఇంజినీర్ ఉన్నప్పటికీ ఏఈ లేకపోవడంతో సబ్ ఇంజినీర్ ను ఇన్ చార్జి తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించినప్పటికీ ఆయన నిరాకరించారు. దీంతో పెర్కిట్ సబ్ ఇంజినీర్ కు భీమ్ గల్ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇన్ చార్జిగా రెండున్నరేళ్లుగా పని చేస్తున్నా రెగ్యులర్ ఏఈని మాత్రం కేటాయించలేదు. మొన్నటి బదిలీల్లో కమ్మర్ పల్లి ఏఈని నిజామాబాద్ డి-5కి ట్రాన్స్ ఫర్ చేయగా ఆయన బాధ్యతలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా కమ్మర్ పల్లికి ఏఈని మాత్రం పంపించలేదు. మోర్తాడ్ ఏఈని ఆదిలాబాద్ కు బదిలీ చేయగా, ఆయన అక్కడికి వెళ్లి బాధ్యతలు స్వీకరించినప్పటికీ సెలవుపై వెళ్లిపోయారు. మోర్తాడ్ నుంచి ఏఈని బదిలీ చేసిన ఉన్నతాధికారులు ఇక్కడికి ఏఈని కేటాయించడాన్ని మాత్రం విస్మరించారు.
రెండేళ్లుగా మోర్తాడ్ ఏడీఈ పోస్టు ఖాళీ
మోర్తాడ్ ఏడీఈ పోస్టు సుమారు రెండేళ్లుగా ఖాళీగా ఉంటోంది. ఇటీవలి బదిలీల్లో ఏడీఈగా వచ్చిన అధికారులు బాధ్యతలు తీసుకుని సెలవుపై వెళ్లిపోయారు. దీంతో మోర్తాడ్ సబ్ డివిజన్ లోని బషీరాబాద్, కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల సెక్షన్ ల విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రైతులు, సామాన్యులతోపాటు విద్యుత్ సిబ్బంది సైతం తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లోకల్ చంటీలు..
యూనియన్ ల పేరు చెప్పుకుని ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలోనే తిష్టవేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నా వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. జిల్లాలోని ఖాళీలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లి భర్తీ చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా ఎస్ఈ చేష్టలుడిగి చూసే పరిస్థితి ఉంది. కొందరు తమకు అనుకూలంగా ఉన్న స్థానాల్లోనే తిష్టవేయగా, మరికొందరు ఏదో ఒక కారణాన్ని చూపుతూ డిప్యుటేషన్లు తెచ్చకుని జిల్లా కేంద్రాన్ని వదలడం లేదు.